Delhi: ఢిల్లీ పేలుడు ఘటనలో కొత్త కోణం షూలోనే ట్రిగ్గర్ మెకానిజం

Delhi: ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్‌ సమీపంలో నవంబర్ 10న చోటుచేసుకున్న కారుబాంబు దాడి కేసు దర్యాప్తులో సంచలన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

షూ ట్రిగ్గర్‌పై ఎన్ఐఏ అనుమానాలు

దాడికి ఉపయోగించిన హ్యుండాయ్ i20 కారులో జరిగిన శక్తివంతమైన పేలుడులో, డ్రైవర్ సీటు కింద దొరికిన ఒక్క షూ దర్యాప్తును కొత్త దిశగా మలిచింది. షూ లోపల ఒక మెటల్ భాగం కనిపించగా, దాన్ని ట్రిగ్గర్ మెకానిజంగానే ఉపయోగించి ఉండవచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అనుమానిస్తోంది.

ఈ విధానం 2001లో రిచర్డ్ రీడ్ చేసిన ‘షూ బాంబ్’ ఘటనను గుర్తుచేస్తోంది.

TATP పేలుడు పదార్థం వినియోగం

దాడిలో ‘మదర్ ఆఫ్ సాతాన్’గా పేరుగాంచిన ట్రైయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ (TATP) పేలుడు పదార్థం ఉపయోగించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతతో కారు పూర్తిగా ఛిద్రమైంది.

ఉగ్రవాది గుర్తింపు: ప్రొఫెసర్‌నే దాడి

ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తి ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలో మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీ అని అధికారలు గుర్తించారు. అక్టోబర్ 30న అతని సహచరుడు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉమర్ పరారైనట్టు వెల్లడైంది.

దర్యాప్తులో, ఈ ఉగ్రవాద మాడ్యూల్ ఉన్నత విద్యావంతులైన డాక్టర్లు నిర్వహించే వైట్ కాలర్ టెర్రర్ నెట్‌వర్క్‌గా పనిచేస్తున్నట్లు తేలింది.

అదనపు ఆధారాలు వెలుగులోకి

ఘటనాస్థలిలో 9ఎంఎం తూటాలు కూడా లభించాయి.మెవాట్ ప్రాంతంలోని హవాలా నెట్‌వర్క్ ద్వారా నిధులు సమకూరినట్లు సమాచారం.

ఇప్పటికే ఒక సహాయకుడిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.నూహ్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో శోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *