Saudi Arabia Bus Accident: పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన భారతీయ భక్తులకు సౌదీ అరేబియాలో అత్యంత ఘోర విషాదం ఎదురైంది. మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న ఉమ్రా యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భయంకర దుర్ఘటనలో బస్సులోని సుమారు 42 మంది యాత్రికులు సజీవ దహనమైనట్లు సమాచారం.
మరణించిన వారిలో ఎక్కువమంది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందినవారే ఉన్నట్లు వస్తున్న వార్తలు ఇరు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి. అనధికారిక సమాచారం ప్రకారం, మృతుల్లో 11 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
తక్షణమే రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఘోర ప్రమాద వార్త తెలియగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో తెలంగాణ వాసులు ఎక్కువగా ఉన్నారనే సమాచారం నేపథ్యంలో ఆయన వెంటనే సహాయక చర్యలపై దృష్టి సారించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని, తెలంగాణకు చెందిన బాధితుల సంఖ్యను నిర్ధారించాలని ముఖ్యమంత్రి… రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (కె. రామకృష్ణారావు), డీజీపీలను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Bomb Threat: అజిత్ కుమార్, ఎంకే స్టాలిన్.. నివాసాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
కేంద్ర విదేశాంగ శాఖ (MEA), సౌదీ ఎంబసీ అధికారులతో వెంటనే సంప్రదింపులు జరిపి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు, ఢిల్లీలోని కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్‌ను అప్రమత్తం చేశారు.
బాధిత కుటుంబాల కోసం కంట్రోల్ రూమ్
తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని, వారికి తగిన సమాచారం, సహాయ సహకారాలు అందించేందుకు గాను రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబ సభ్యులు వివరాల కోసం సంప్రదించాల్సిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:
-
+91 79979 59754
-
+91 99129 19545
హైదరాబాద్‌లోని స్థానిక ముస్లిం సంఘాలు, నాయకులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సహాయ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ దుర్ఘటన ఉమ్రా యాత్రికుల రోడ్డు భద్రతపై ఆందోళన కలిగించింది. మరణించినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని సర్వత్రా ప్రార్థనలు జరుగుతున్నాయి.
ప్రమాదం జరిగిందిలా..
నవంబర్ 17, 2025న తెల్లవారుజామున 1:30 గంటల (భారత కాలమానం ప్రకారం) సమయంలో, బదర్-మదీనా మధ్య ఉన్న ముఫ్రిహాత్ (ముహ్రాస్) ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఉమ్రా యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు, డీజిల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే ట్యాంకర్‌లోని ఇంధనం ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సు పూర్తిగా దగ్ధమవడం వలన మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. కొందరు యాత్రికులు తీవ్రమైన బర్న్స్, ట్రామా వంటి గాయాలతో మదీనాలోని స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
సౌదీలో ఘోర బస్సు ప్రమాదం
42 మంది సజీవదహనం.. హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం
మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు
ట్యాంకర్ నుండి మంటలు చెలరేగి బస్సుకు అంటుకొని యాత్రికులు సజీవదహనం
మృతుల్లో 21 మంది మహిళలు, 11… pic.twitter.com/PtH11jJPBS
— Telugu Scribe (@TeluguScribe) November 17, 2025
