Telangana: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యురాళ్లకు ప్రభుత్వం అందించనున్న ఉచిత చీరల పంపిణీకి సన్నాహాలు ముమ్మరమయ్యాయి. ఈ పథకం ద్వారా మొత్తం 61 లక్షల మంది మహిళలకు చీరలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 50 లక్షల చీరలు జిల్లాలకు చేరాయి. మిగిలిన చీరలను కూడా వారం రోజుల్లోగా పంపిణీ చేసేందుకు చేనేత, జౌళి శాఖ అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబరు 9వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచిత చీరలు అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కోసం ప్రభుత్వం ₹318 కోట్లను విడుదల చేయగా, మార్చి నెల నుంచే చేనేత, జౌళి శాఖ ఈ చీరల తయారీని పర్యవేక్షిస్తోంది.
చీరల పంపిణీ తేదీని ప్రభుత్వం త్వరలో అధికారికంగా ఖరారు చేయనుంది. తేదీ నిర్ణయించిన వెంటనే, రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. ఈ చీరల పంపిణీని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి అయిన ఈ నెల 19న ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఏదేమైనా, మహిళలు ఈ బహుమతి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

