Kavitha

Kavitha: బీఆర్ఎస్ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం మెదక్ జిల్లాలో ‘తెలంగాణ జాగృతి జనం బాట’ కార్యక్రమంలో పర్యటించిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణాలను, పార్టీలోని అగ్రనాయకుల తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

సోషల్ మీడియాలోనే బీఆర్ఎస్.. అందుకే ఓటమి
బీఆర్ఎస్ పార్టీ కేవలం సోషల్ మీడియాలో మాత్రమే చురుకుగా ఉందని కవిత విమర్శించారు. అందుకే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోయిందని ఆమె విశ్లేషించారు. మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం మానేసి, ప్రజల్లోకి వచ్చి పనిచేయాలని బహిరంగంగా సూచించారు. వేల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు తమతో టచ్‌లో ఉన్నారని ఆమె సంచలన వ్యామెంట్స్ చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన జగదీశ్‌రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి నేతల ఆస్తుల పెరుగుదలపై కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. వారు గతంలో ఎలా ఉండేవారని, ఇప్పుడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులు తమ వ్యక్తిగత ఆస్తులను పెంచుకున్నారు కానీ, పార్టీ క్యాడర్‌ను మాత్రం పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను తప్పుదోవ పట్టించి, ఈ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వీరి అరాచకాల వల్లే గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని కవిత స్పష్టం చేశారు.

Also Read: VC Sajjanar: నా పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

రీజినల్ రింగ్ రోడ్డు (RRR) అలైన్‌మెంట్ మార్పు వెనుక కూడా బీఆర్ఎస్ నేతల స్వప్రయోజనాలు ఉన్నాయని కవిత తీవ్ర ఆరోపణ చేశారు. హరీశ్‌రావు ఫాంహౌస్‌కు, అలాగే బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, నవీన్ రావు యొక్క ల్యాండ్‌ల కోసం ఆర్ఆర్ఆర్ మార్గాన్ని మార్చారని రైతులు చెబుతున్నారని ఆమె తెలిపారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యక్తిగత పాల వ్యాపారం, గురుకుల హాస్టళ్లకు పాలు సరఫరా చేయడంలో జరిగిన అక్రమాలపై కూడా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హరీశ్‌రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని ఆమె సంచలన ఆరోపణ చేశారు. హరీశ్ రావు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత నిలదీశారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అయినా, మెదక్ జిల్లా ప్రజల బతుకులు మాత్రం మారలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ద్వారా జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉన్నా, ఒక్క చుక్క కూడా నీరు రాలేదని, దీనికి ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ రావు నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని, ఆర్ఆర్ఆర్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. కోటి లేదా భూమికి భూమి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ సాధనే తమ లక్ష్యమని కవిత ఉద్ఘాటించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *