Home Minister Anitha: విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సుకు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. ఈ సదస్సుపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
3,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన రక్షణ
ఈ కీలక పెట్టుబడుల సదస్సు కోసం ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని హోంమంత్రి అనిత తెలిపారు. సుమారు 3,500 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల దృష్ట్యా రాష్ట్రమంతటా పూర్తి అప్రమత్తత కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు క్షేమంగా తిరిగి వెళ్లేవరకూ వారి రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదని వివరించారు.
చంద్రబాబు ‘బ్రాండ్’ చూసి తిరిగి వస్తున్న కంపెనీలు
సీఐఐ సదస్సుపై జగన్ బృందం చేస్తున్న విష ప్రచారాన్ని ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత హెచ్చరించారు. గతంలో జగన్ పాలన కారణంగా రాష్ట్రం నుంచి పారిపోయిన కంపెనీలన్నీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు బ్రాండ్‌ను, ఆయన పారిశ్రామిక విధానాలను చూసి తిరిగి వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
Also Read: Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వంటి ముగ్గురు మంచి నాయకులు ఉండటం రాష్ట్రానికి అదృష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఈ ముగ్గురూ కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని అనిత తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అలాగే, చిత్తూరులో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ కోసం కృషి జరుగుతోందని చెప్పారు. గతంలో వలసలు వెళ్లే ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు అన్ని ప్రాంతాల ప్రజలు వలస వచ్చే ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని హోంమంత్రి అనిత ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
