Vijayawada

Vijayawada: విజయవాడలో దారుణం: నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Vijayawada: విజయవాడలో భయంకరమైన హత్య జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాలు చిలికిచిలికి గాలివానలా మారడంతో, భర్తే కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై దారుణంగా గొంతుకోసి చంపాడు. ఈ సంఘటన గురువారం ఉదయం సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నర్సు సరస్వతి దారుణ మృతి
హత్యకు గురైన మహిళను సరస్వతిగా గుర్తించారు. ఆమె విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. సరస్వతి భర్త పేరు విజయ్. కొద్దికాలంగా వీరి దాంపత్య జీవితం సజావుగా సాగడం లేదు. చిన్న చిన్న విషయాలకు తరచూ గొడవలు జరుగుతుండడంతో, ఇటీవల కాలంలో ఈ దంపతులు విడివిడిగా నివసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భార్యపై కోపం పెంచుకున్న విజయ్, గురువారం ఉదయం ఆమె ఉన్న చోటుకు వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన విజయ్ వెంట తెచ్చుకున్న కత్తితో సరస్వతిపై దాడి చేసి, గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో సరస్వతి అక్కడికక్కడే మృతి చెందింది.

Also Read: Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

కత్తితో వీరంగం, నిందితుడి అరెస్ట్
భార్యను హత్య చేసిన తర్వాత కూడా విజయ్ కత్తితో వీరంగం సృష్టించాడు. “ఎవరైనా దగ్గరికి వస్తే చంపేస్తా” అంటూ కేకలు వేయడంతో స్థానికులు భయపడి దగ్గరకు రాలేకపోయారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సూర్యారావు పేట పోలీసులు నిందితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటనపై స్థానికులు, సరస్వతి పనిచేసే ఆసుపత్రి సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *