Weather: అల్పపీడన ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 72 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. శుక్రవారం కడప, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.అదేవిధంగా ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉండి.. సాయంత్రం చల్లబడి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, వ్యవసాయ పనుల్లో అన్నదాతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.