Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ఆంధ్ర తీరానికి ఆనుకొని మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో మరో ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో వర్ష మేఘాలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు.
వర్షాల ముప్పు ఉన్న జిల్లాలు:
నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయ్యే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం:
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, వికారాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే తేలికపాటి వర్షాలు కురిశాయని టీజీడీపీఎస్ తెలిపింది.
బుధ, గురువారాల్లో కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు, మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
