Road Accident: తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాల కలకలం కొనసాగుతోంది. ఈ రోజు (మంగళవారం) తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పరిధిలోని రేణికుంట బ్రిడ్జి వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలు అయ్యాయి.
ప్రమాదం ధాటికి బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. వడ్ల బస్తాల లోడుతో ఉన్న ట్రాక్టర్ రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. బస్సు హైదరాబాద్ నుండి మెట్‌పల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రాక్టర్ డ్రైవర్, రవి, ప్రమాదాన్ని గమనించి కిందకు దూకడంతో తృటిలో పెను ప్రాణనష్టం తప్పింది.
Also Read: Journey of Sri Charani: వరల్డ్‌కప్ కన్నా ముందు కష్టాల కడలిని దాటింది..!
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం.. రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను వెంటనే కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
ఈ ఘటన కారణంగా రాజీవ్ రహదారిపై కొంత సమయం పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై పడిన ధాన్యాన్ని తొలగించి, దెబ్బతిన్న వాహనాలను పక్కకు జరిపిన అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోతున్నాయని ఆందోళన కలిగిస్తున్నాయి.
