Chandrababu 393 Car

Chandrababu 393 Car: ఒకప్పుడు రాష్ట్రంలో ఆ కారుకున్న క్రేజ్‌ వేరు!

Chandrababu 393 Car: ఏ నాయకుడికైనా గతం నుంచి వచ్చిన కొన్ని వస్తువులు జ్ఞాపకాల సొత్తుగా మిగిలిపోతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా అలాంటిదే ఆ పాత అంబాసిడర్ కారు. ఏపీ 09 జీ 393 దాని నంబర్‌. దాన్ని లక్కీ చార్మ్‌గా భావించే ఆయన, దశాబ్దాలుగా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. 1978లో చంద్రబాబు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే సమయంలో కొనుగోలు చేసిన ఈ వైట్ అంబాసిడర్, ఆయన మంత్రి పదవి కాలంలోనూ సేవలందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక వాహనాలు మారినా, ఈ కారును మాత్రం బాబు వదలలేదు. రాష్ట్రవ్యాప్త సుడిగాలి పర్యటనలు, ప్రజా సమస్యలపై చర్చలు, అధికారులతో ఎన్నో అంశాలపై మేధోమదనం… అన్నీ ఈ కారులోనే జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు 393 నంబర్‌ వైట్‌ అంబాసిడర్‌ కనబడిందంటే చాలు… ‘సీబీఎన్ కారు’గా గుర్తించేవారు.

Also Read: Vizag: వైజాగ్ లో డ్రగ్స్ పట్టుకున్న ఈగల్ టీం..

ఆ కాలంలో అంబాసిడర్ కారు ఇండియన్ రోడ్లపై రాణీగా పేరుగాంచిన విషయం తెలిసిందే. 1958 నుంచి 2014 వరకు హిందుస్తాన్‌ మోటార్స్ తయారు చేసిన ఈ మోడల్, దేశంలో 40 లక్షలకు పైగా అమ్ముడైంది. ఇప్పుడు హైదరాబాదులో ఉన్న ఈ కారును అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. నిన్న పార్టీ ఆఫీసులో నాలుగు గంటలు గడిపిన చంద్రబాబు, కారును పరిశీలించి భావోద్వేగంగా మాట్లాడారు. “ఈ కారులోనే ఎక్కువ పర్యటనలు చేశాను, ఈ కారుతో నాకు ఎంతో అనుబంధం ఉంది” అంటూ గుర్తు చేసుకున్నారు. ఇకపై పార్టీ ఆఫీసులోనే దీన్ని ప్రదర్శనకు ఉంచుతారు.

వాహనాల పట్ల ఇలాంటి ఆరాధన భావం నందమూరి-నారా కుటుంబాల్లో కనబడుతూ ఉంటుంది. ఎన్టీఆర్ చైతన్యరథం ఇప్పటికీ సంరక్షణలో ఉంది. హరికృష్ణ నడిపిన ఆ వ్యాన్‌లో రాష్ట్రమంతా పర్యటించారు ఎన్టీఆర్. హరికృష్ణకు కూడా కార్ల పిచ్చి ఎక్కువే అని చెబుతారు. కొత్త మోడళ్లు వచ్చిన వెంటనే కొనేవారట. ఆయన 2018లో ఖమ్మం జిల్లాలో కారు ప్రమాదంలో మరణించిన సంగతి గుర్తుండే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, మంత్రి నారా లోకేష్ కూడా వాహనాలను ఇలాగే లైక్‌ చేస్తారట. చంద్రబాబు సైతం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, తన లక్కీ అంబాసిడర్‌ను జ్ఞాపక చిహ్నంగా మార్చారు. ఈ కారు కేవలం ఒక వాహనం కాదు, ఒక రాజకీయ దురంధరుడు తన రాజకీయ యాత్రలో ఎన్నో మైలురాయిలను దాటిన అరుదైన కారనే చెప్పాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *