Srikalahasti Chairman: దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం హాస్యాస్పదంగా, చర్చినీంశంగా మారింది. రాహు కేతు పూజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ క్షేత్రం శ్రీకాళహస్తి. అలాంటి క్షేత్రంలో పాలకమండలి పదవులు దక్కటం అదృష్టంగా భావిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం కొలువుతీరాక దాదాపు 16 నెలల పాటు పాలకమండలి పదవులు భర్తీ కాకుండా ఉండడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఈ వ్యవహారానికి పుల్ స్టాప్ పెడుతూ రాష్ట్రంలోని అన్ని దేవస్థానాలకు పాలకమండలను ప్రకటించింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో టిడిపితో పాటు జనసేన, బిజెపి భాగస్వామ్యం కావడంతో ఈసారి లెక్కలు మారాయి. పదవులు వస్తాయని భావించిన వారికి భంగపాటు ఎదురైతే.. ఊహించని విధంగా కొత్త పేర్లు పాలకమండలిలో చోటుచేసుకున్నాయి. ఓ రకంగా వైకుంఠపాళిని తలపించేలా శ్రీకాళహస్తి పాలకమండలి నియామకం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఎప్పటికప్పుడు మారిన వివిధ రాజకీయ సమీకరణాలు బేరీజు వేసుకుని, తీసివేతల తర్వాత కొత్త పాలకమండలి ప్రకటన విడుదల చేశారు. అనూహ్యంగా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి జనసేన నేత కొట్టే సాయి ప్రసాద్‌ను వరించింది. దీంతో ఆ పదవి కచ్చితంగా వస్తుందని ఆశించిన వారు తీవ్ర అసంతృప్తిలో ఉండి పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఇక పాలకమండలిలో బోర్డు సభ్యుల ఎంపిక మరో విచిత్రంగా మారిందని చెప్పొచ్చు. సాధారణంగా నియోజకవర్గంలో స్థానికులే పాలకమండలిలో సభ్యులుగా ఎంపిక అయ్యేవారు. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా టిటిడి పాలకమండలి తరహాలో వివిధ జిల్లాల వరకు పార్టీ కార్యకర్తలకు శ్రీకాళహస్తి దేవస్థానంలో సభ్యులుగా చోటు కల్పించారు.
Also Read: ISRO: మరో భారీ ప్రయోగానికి ఇస్రో సిద్ధం
ఇదంతా ఒక ఎత్తైతే… ప్రమాణ స్వీకార మహోత్సవంలో మరిన్ని విచిత్రాలు చోటు చేసుకున్నాయి. కూటమిలోని మూడు పార్టీల నాయకులు వేరువేరుగా ప్రమాణస్వీకారం చేయడం మరింత విడ్డూరంగా మారింది. అధికారులకు సరిగా సమాచారం కూడా లేకపోవడంతో అయోమయానికి గురిచేసింది. దీనికి తోడు గత మూడు నాలుగు రోజులుగా ప్రతి రోజు ప్రమాణస్వీకారాల తంతు కొనసాగుతూ ఉండడంతో భక్తుల దర్శనాలకు ఇబ్బందులు తప్పని పరిస్థితి ఏర్పడింది. ముందుగా బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారాలు ముగిసిన తరువాత చివరగా చైర్మన్‌గా కొట్టేసాయి ఆలయంలో ప్రమాణం చేశారు. ఇది ఒక రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు జరిగిన అవమానం అన్న విమర్శ కూడా వ్యక్తమవుతోంది. ఇక నిత్యం శివనామ స్మరణలు వినిపించే శ్రీకాళహస్తి ఆలయంలో గత మూడు రోజులుగా రాజకీయ ర్యాలీలు, చర్చలు జరగటం కొసమెరుపుగా చెప్పొచ్చు.
దశాబ్దాలుగా ఎన్నడూ శ్రీకాళహస్తి ఆలయ చరిత్రలో ఇలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకోలేదు. దివంగత టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో ఎంతో హుందాగా నడిచిన పాలకమండలి వ్యవహారాలను, తాజా పరిణామాలతో పోల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తనయుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కూడా ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అన్న చర్చ జరుగుతోంది. ఒక్కో పార్టీ సభ్యుల ప్రమాణ స్వీకారాలకు ఒక్కోసారి వెళ్లడం.. ఒకరకరంగా ఎమ్మెల్యేకి అసహనం కలిగించే విధంగా ఈ పరిస్థితులు మారాయని పలువురు అంటున్నారు. అయినప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా మిగతా పనులు మానుకొని రోజూ ఆలయం చుట్టూ ఎమ్మెల్యే తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. పాలకమండలి నియామకంలోనూ, ప్రమాణ స్వీకారంలోనూ ఇన్ని చిత్ర, విచిత్రాలు చోటు చేసుకుంటే… రేపు ట్రస్టు బోర్డు పదవీకాలంలో మరెన్ని వింతలు చూడాల్సి వస్తుందోనని శ్రీకాళహస్తి ప్రజలు చర్చించుకుంటున్నారు.
