Elon Musk

Elon Musk: రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్.. 500 బిలియన్ డాలర్స్ మార్క్ దాటిన మొదటి బిలియనీర్

Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో మరో చరిత్ర సృష్టించారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. తొలిసారి 500 బిలియన్ డాలర్ల (సుమారు ₹41.5 లక్షల కోట్ల) మార్కును దాటి అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ట్రాకర్ ప్రకారం, మస్క్ సంపద బుధవారం (అక్టోబర్ 1) మధ్యాహ్నం 3.55 గంటలకు 499.5 బిలియన్ డాలర్లను చేరగా, కొన్ని నిమిషాలకే 500 బిలియన్ మార్కును దాటింది. దీంతో ఆయన తొలి హాఫ్-ట్రిలియనీర్ గా రికార్డు సృష్టించారు.

టెస్లా – మస్క్ సంపదకు బలం

ఎలాన్ మస్క్ సంపదలో పెద్ద భాగం టెస్లా నుంచే వచ్చింది. ప్రస్తుతం టెస్లాలో ఆయనకు 12.4 శాతం వాటా ఉంది. ఈ ఏడాది టెస్లా షేర్లు 14 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా బుధవారం ఒక్కరోజే నాలుగు శాతం పెరిగి, మస్క్ సంపదలో 9.3 బిలియన్ డాలర్లు జతచేశాయి. గత కొద్ది నెలల్లో టెస్లా షేర్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఇటీవల మస్క్ ఒక బిలియన్ డాలర్ల షేర్లు కొనుగోలు చేయడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచింది.

స్పేస్‌ఎక్స్‌, xAI, స్టార్‌లింక్…

టెస్లా కాకుండా స్పేస్‌ఎక్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్‌అప్ xAI, స్టార్‌లింక్‌, న్యూరాలింక్ వంటి మస్క్ వ్యాపారాలు కూడా వాల్యువేషన్‌లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా స్పేస్‌ఎక్స్‌ వాణిజ్య రాకెట్ సేవలు, స్టార్‌లింక్‌ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్, AI మార్కెట్ విస్తరణ… ఇవన్నీ ఆయన సంపదను మరింత పెంచుతున్నాయి.

ఇది కూడా చదవండి: Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. 72 మంది మృతి

తొలి ట్రిలియనీర్ అవుతారా?

ప్రస్తుతం మస్క్ లక్ష్యం ట్రిలియన్ డాలర్ల క్లబ్ లో తొలి వ్యక్తిగా నిలవడం. టెస్లా రాబోయే రోబోట్యాక్సీ ప్రాజెక్ట్‌, AI ఆధారిత కొత్త సాంకేతికతలు విజయవంతమైతే, ఆయనకు దాదాపు 900 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు ప్రోత్సాహక ప్యాకేజీ కింద లభించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అలా జరిగితే ఆయన సంపద ట్రిలియన్ డాలర్లను దాటడం ఖాయం.

సవాళ్లు కూడా ఉన్నాయి

అయితే మస్క్‌కు ప్రతిదీ సాఫీగా లేదు. చైనాకు చెందిన BYD వంటి కంపెనీల నుంచి టెస్లాకు గట్టి పోటీ ఎదురవుతోంది. జర్మనీతో పాటు యూరప్ మార్కెట్‌లో అమ్మకాలు తగ్గాయి. ఈ సవాళ్లను అధిగమిస్తూ మార్కెట్ విస్తరణ సాధిస్తేనే మస్క్ ట్రిలియనీర్ కల నిజమవుతుంది.

రెండో స్థానంలో లారీ ఎలిసన్

ఫోర్బ్స్ లెక్కల ప్రకారం, మస్క్ తరువాత స్థానంలో ఒరాకిల్ కో-ఫౌండర్ లారీ ఎలిసన్ నిలిచారు. ఆయన నికర సంపద 351.5 బిలియన్ డాలర్లు (సుమారు ₹29.17 లక్షల కోట్లు).

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *