Kishan Reddy: బొగ్గుగని కార్మికులకు గుడ్ న్యూస్

Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కోల్ ఇండియాలో పని చేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ ప్రయోజనాలు కల్పిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం రాంచీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ సెప్టెంబర్ 17 నుంచి, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు, విశ్వకర్మ పూజను పురస్కరించుకుని కొత్త పథకాలు అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.

కొత్త నిబంధనల ప్రకారం, కోల్ ఇండియాలోని రెగ్యులర్ ఉద్యోగులకు కోటి రూపాయల అదనపు బీమా, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.40 లక్షల వరకు బీమా వర్తించనుంది. అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులకు గౌరవప్రదమైన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో ఒకే విధమైన డ్రెస్ కోడ్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ యూనిఫారమ్‌లను కోల్ ఇండియా సంస్థే అందించనుందని, అధికారులు కూడా దీనికి లోబడి ఉంటారని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో బొగ్గు రంగం గణనీయమైన పురోగతి సాధించిందని, దేశంలో బొగ్గు ఉత్పత్తి తొలిసారి ఒక బిలియన్ టన్నులు దాటిందని, దిగుమతులు తగ్గించడం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.60,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేశామని తెలిపారు. అంతేకాక, ప్రభుత్వం కీలక ఖనిజాల అన్వేషణపై దృష్టి సారించిందని, రూ.32,000 కోట్లతో ‘నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్’ ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో 74 శాతం విద్యుత్ థర్మల్ పవర్ ద్వారానే ఉత్పత్తి అవుతోందని, ఇంధన భద్రత కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *