Bandi Plan Karimnagar: కరీంనగర్ జిల్లాలో బీజేపీ హడావుడి మొదలైంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. గత నెల రోజుల నుంచే సమావేశాలతో నేతలు బిజీ అయ్యారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మెజారిటీ స్థానాలు గెలిచేందుకు సంజయ్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే ప్రత్యేక నిధులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీలను గెలిపిస్తే ఐదు లక్షలు, జెడ్పీటీసీని గెలిపిస్తే పది లక్షల నిధులు మంజూరు చేసి.. ఇతర నిధులతో కలిపి అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా గ్రామ స్థాయి నుంచే సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతలు ఇప్పటికే మండల అధ్యక్షులతో సమావేశమయ్యారు. అదే విధంగా పోలింగ్ బూత్ స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు హాజరయ్యారు. సంజయ్ వారంలో రెండు రోజులు కరీంనగర్లోనే మకాం వేస్తున్నారు. రెగ్యులర్గా కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అశావాహులతో సమావేశమవుతున్నారు. అంతేకాకుండా బీజేపీ పరిస్థితి గురించి క్షేత్ర స్థాయిలో సర్వేను నిర్వహిస్తున్నారు. ప్రతికూలంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఢీకొట్టి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేందుకు ప్లాన్ చేస్తున్నారు సంజయ్.
Also Read: Sonia Gandhi: పౌరసత్వం కేసుపై ఢిల్లీ కోర్టులో సోనియా గాంధీకి ఊరట
గతంలో జరిగిన ఎన్నికలలో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో బీజేపీకి పెద్దగా సీట్లు రాలేదు. అయితే కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ ఓటు శాతం పెంచుకుంది. అయితే ఈసారి గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికల్లో పాగా వేయాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే అభివృద్ధి జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిస్తున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా బలమైన నేతలకు టికెట్ ఇస్తామని, ఎలాంటి వర్గాలు ఉండవని సంజయ్ స్పష్టం చేశారు. ఎప్పుడూ ప్రజలతో ఉండే నేతలకు పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్నారు సంజయ్. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ బలహీనంగా ఉన్నాయని, గట్టిగా కష్టపడితే 80 శాతానికి పైగా సీట్లలో విజయం సాధిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఎలాంటి నోటిఫికేషన్ రానప్పటికీ బీజేపీలో మాత్రం హడావుడి మొదలైంది.
