Iphone: ఇకనుంచి ఇండియాలోనే తయారీ..

Iphone: టెక్ దిగ్గజం యాపిల్ తన తదుపరి ఐఫోన్ 17 సిరీస్‌ను పూర్తిగా భారత్‌లోనే తయారు చేయాలని నిర్ణయించింది. ఈ అడుగు ద్వారా కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతమివ్వడమే కాకుండా, దేశాన్ని ప్రీమియం పరికరాల తయారీ కేంద్రంగా నిలబెడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

తయారీని భారత్‌లో విస్తరించడం వల్ల యాపిల్‌కు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. పూర్తిగా తయారైన ఫోన్లను దిగుమతి చేసుకుంటే విధించే 20% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ భారం నుంచి కంపెనీ తప్పించుకోగలదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ భాగస్వామ్యంతో ఈ ఉత్పత్తి చేపట్టనుంది.

గ్రాంట్ థార్న్‌టన్ భరత్ సంస్థ నిపుణుడు క్రిషన్ అరోరా మాట్లాడుతూ –“ఈ నిర్ణయం వల్ల భారత్‌లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఎగుమతులు విస్తరిస్తాయి. హైటెక్ తయారీ రంగంలో మన విశ్వసనీయత బలపడుతుంది. అంతేకాకుండా, అమెరికా వంటి దేశాల్లో సుంకాల పెరుగుదల వంటి సవాళ్ల నుంచి యాపిల్ తనను తాను కాపాడుకోవచ్చు” అని తెలిపారు.

కేంద్రం అందిస్తున్న పీఎల్ఐ పథకం (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు) యాపిల్ వ్యూహానికి మరింత సహకరిస్తోంది. ఈ పథకం కింద, భారత్‌లో తయారు చేసి విక్రయించే ఫోన్లపై 5 ఏళ్లపాటు 4-6% నగదు ప్రోత్సాహకం లభిస్తోంది. ఈ ప్రోత్సాహకంతో యాపిల్ కాంట్రాక్ట్ తయారీదారులు ఇప్పటికే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేశారు. 2025 ప్రథమార్ధంలో ఎగుమతులు గత సంవత్సరం కంటే 53% పెరిగి 2.39 కోట్ల యూనిట్లకు చేరాయి.

అయితే, ఈ నిర్ణయం కారణంగా భారతీయ వినియోగదారులకు ధరలు వెంటనే తగ్గే అవకాశం లేదు అని క్రిషన్ అరోరా స్పష్టం చేశారు. మరోవైపు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి రాయితీలు, పర్యావరణ అనుమతుల సులభతరం, తక్కువ ధరలకు భూమి వంటి ప్రోత్సాహకాలు అందిస్తూ యాపిల్ తయారీ ప్రణాళికలకు బలంగా మద్దతు ఇస్తున్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *