Gujarat: గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ షాకింగ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 17 ఏళ్ల 12వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులే హాస్టల్ గదిలో దారుణంగా దాడి చేసి వీడియోలు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల్లో విద్యార్థులు తోటి విద్యార్థిపై కసిగా దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ వీడియో బయటకు రావడంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన జూలై 27న మొదలైంది. ఒక రోజు ముందు కబడ్డీ ఆటలో జరిగిన చిన్న గొడవ హాస్టల్ గదిలో ఘోర దాడికి దారితీసింది. నలుగురు విద్యార్థులు అతడిపై దాడి చేయగా, మరో విద్యార్థి ఆ ఘటనను వీడియో తీశాడు. రక్షాబంధన్ రోజున కూడా మరొకసారి హాస్టల్‌లో హింసాత్మక ఘటన జరిగింది. ఆ సమయంలో మరో విద్యార్థి చిరుతిళ్లు పంచుకోవడానికి నిరాకరించడంతో అతనిపై కూడా దాడి జరిగింది. ఈ రెండు ఘటనల వీడియోలు బయటకు రావడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.
This Junagadh hostel assault video is disturbing. 5 minors booked under the Juvenile Justice Act. A wake-up call, bullying ruins lives. Parents, schools & hostels must ensure safe spaces for every child.
https://t.co/xF8SX4kseK— Sood Saab (@SoodSaab11) September 4, 2025
దాడికి గురైన విద్యార్థి తండ్రి విమల్ చోంచా మాట్లాడుతూ, “నా కుమారుడిపై దాడి జరిగిన విషయం పాఠశాల నుంచి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటన గురించి నాకు తెలిసింది సోషల్ మీడియా ద్వారా మాత్రమే అన్నారు. నిర్వాహకులు మమ్మల్ని కలవడానికి కూడా నిరాకరించారు. ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత భయపడిన విద్యార్థి అనారోగ్యంగా ఉన్నానని చెప్పి హాస్టల్ నుండి ఇంటికి వచ్చాడు..
ఇది కూడా చదవండి: Uttar Pradesh: యూపీ తవ్వకాల్లో బయటపడిన వందేళ్లనాటి ట్రాక్టర్
జునాగఢ్ డివైఎస్పీ హితేష్ ధంధాలియా మాట్లాడుతూ, నలుగురు విద్యార్థులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితుడు, అతని తల్లిదండ్రులు, నిందిత విద్యార్థుల సంరక్షకుల వాంగ్మూలాలు సేకరించామని, పాఠశాల నిర్వాహకుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
ఈ సంఘటనలపై జిల్లా కలెక్టర్ అనిల్ రణవాసియా బహుళ విభాగాల అధికారి బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ప్రాంట్ అధికారి, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, డివైఎస్పీ, జిల్లా విద్యాశాఖ అధికారి, భద్రతా అధికారి ఉన్నారు. పోలీసులు ఇప్పటికే దాడికి పాల్పడిన నలుగురిని పాఠశాల నుండి బహిష్కరించగా, ఒకరికి లీవింగ్ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన చెలరేగింది. హాస్టల్‌లు, పాఠశాలల్లో భద్రతా చర్యలను కఠినతరం చేయాలని, సీసీటీవీ పర్యవేక్షణ, కౌన్సెలింగ్ సదుపాయాలను తప్పనిసరి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. చిన్న గొడవలే పెద్ద దాడులకు దారితీసే పరిస్థితి ఉండకూడదని, విద్యార్థుల భద్రతపై అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది.
