Kavitha: బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి పార్టీ అంతర్గత కలహాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న కుట్రలకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావే ప్రధాన కారణమని ఆరోపించారు. “హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్. పార్టీని గెలిపించినట్టు డ్రామా చేస్తారు కానీ వాస్తవానికి ఆయనే అన్ని సమస్యలకు మూలం” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రేవంత్‌తో కుమ్మక్కు
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హరీష్ రావు ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించినప్పటి నుంచి నాపై కుట్రలు మొదలయ్యాయి. లక్షల కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ చెబుతారు కానీ హరీష్‌పై మాత్రం ఎందుకు మాట్లాడటం లేదు? కేసీఆర్‌పై సీబీఐ కేసు రావడానికి కారణం హరీష్, సంతోష్ రాళ్లే” అని కవిత ఆరోపించారు.
జాగృతి ఆత్మతో పోరాటం
తాను 20 ఏళ్లుగా తెలంగాణ కోసం కష్టపడిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. “జాగృతి తెలంగాణ ఆత్మ. నేను 47 నియోజకవర్గాలు పర్యటించి ప్రజా సమస్యలపై పోరాటం చేశా. గురుకులాల అవినీతి, బనకచర్ల సమస్య, భూవివాదాలపై నిరంతరం పోరాడాను. ఈ సేవల తర్వాత కూడా నన్ను పార్టీ వ్యతిరేకి అంటారా?” అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Kavitha: రామన్న వారితో జాగ్రత్తగా ఉండు.. నాన్న మీ చుట్టూ ఏదో జరుగుతుంది
కేటీఆర్‌పై అసంతృప్తి
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఒక మహిళా ఎమ్మెల్సీ తనపై జరుగుతున్న కుట్రలను చెప్పినా ఫోన్ చేయలేదా? 103 రోజులైనా మీరు స్పందించలేదు. రేపు ఇదే కుట్రలు మీపై, కేసీఆర్‌పై జరుగుతాయి” అని హెచ్చరించారు.
కుటుంబ విభేదాలపై కన్నీరు
కవిత మాట్లాడుతూ, “కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలన్న కుట్రలో కొందరు ఉన్నారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపించడం అందులో భాగం. నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను” అని కన్నీటి పర్యంతమయ్యారు. హరీష్ రావు కట్టప్పలా నటించి ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారని, కేటీఆర్‌ను ఓడించేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేశారని కూడా ఆరోపించారు.