Kavitha: బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి వరకు పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన కవిత, తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి బీఆర్‌ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. తండ్రి కేసీఆర్ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నానని, కానీ తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“బంగారు తెలంగాణ అంటే హరీష్–సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటే కాదు. పార్టీని స్వాధీనం చేసుకోవడానికే నన్ను బయటకు తోసేశారు,” అని కవిత ఆరోపించారు. తనపై విషప్రచారం జరుగుతున్నా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించలేదని విమర్శించారు. అంతర్గత ప్రజాస్వామ్యం లేని పార్టీగా బీఆర్‌ఎస్‌ను నిలదీశారు.
రేవంత్–హరీష్ పై కవిత ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్టు మార్పుల వెనుక ఉన్న అసలు బాధ్యులపై ప్రశ్నల వర్షం కురిపించిన కవిత, హరీష్ రావు, సంతోష్ కారణంగానే విషయం సీబీఐ విచారణ దాకా వెళ్లిందని అన్నారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య “మ్యాచ్‌ఫిక్సింగ్” జరుగుతోందని బహిరంగంగా వ్యాఖ్యానించారు. హరీష్ రేవంత్ కు సరెండర్ అయ్యారని కూడా కవిత అన్నారు.
ఇది కూడా చదవండి: Kavitha: సొంత చెల్లిపై కుట్రలు జరుగుతుంటే.. కేటీఆర్ ఏం చేస్తున్నారు?
అన్నయ్య కేటీఆర్‌కు సూటి ప్రశ్నలు
“నాపై కుట్ర జరుగుతోందని చెప్పినా 103 రోజులు గడిచాయి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్పందించరా అన్నా? బంధుత్వం పక్కన పెట్టండి. మహిళా ఎమ్మెల్సీ బాధపడితే కనీసం అడగరా?” అంటూ కవిత కేటీఆర్‌పై నేరుగా ప్రశ్నలు విసిరారు. “హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపిస్తారు కానీ తెలంగాణ కోసం కష్టపడే వ్యక్తులు కాదు. వారిని పక్కన పెట్టితేనే పార్టీ బతుకుతుంది, నాన్న పేరు నిలుస్తుంది,” అని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ, పార్టీ పదవులకు రాజీనామా
కవిత తన ఎమ్మెల్సీ పదవి, పార్టీ సభ్యత్వం రెండింటికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్‌కు ఫార్మాట్ ప్రకారం రాజీనామా లేఖ పంపుతున్నానని తెలిపారు. “పదవులు నాకు ముఖ్యం కావు. నా ప్రాణం పోయినా నాన్న కేసీఆర్, అన్నయ్య కేటీఆర్‌లకు హాని చేయాలని కోరుకోను,” అని కవిత స్పష్టంచేశారు.