Hyderabad Metro: హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో రైల్ సంస్థ శుభవార్తను అందించింది. గణపతి నవరాత్రి ఉత్సవాలు సందర్బంగా భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆగస్ట్ 30న మెట్రో సేవలను ప్రత్యేకంగా పొడిగించింది. ఈ రోజు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరనుంది.
“మీ పండల్ దర్శనాలు ఇప్పుడు మరింత సులభం, టెన్షన్ లేకుండా… ఎక్కువ సమయం, ఎక్కువ భక్తి, ఎక్కువ సౌకర్యం,” అని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు. నగరంలో గణపతి పండుగ ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో, వారాంతం కావడంతో భారీగా భక్తులు రాకపోకలు చేసే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
ఈ నిర్ణయం వల్ల భక్తులు ఆలయాలు, పండల్స్ సందర్శనకు అదనపు సమయం కేటాయించుకోవచ్చని, రాత్రి వేళల్లో కూడా సులభంగా ప్రయాణం చేయవచ్చని అధికారులు తెలిపారు. మెట్రో సదుపాయాలను మరింత ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలని ప్రజలను కోరారు.

