Konda vishveshwar: బీజేపీలో అంతర్గత అసంతృప్తి మరోసారి బహిర్గతమైంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్న నిరసన తెలిపారు. పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి కానుకగా ఫుట్‌బాల్ అందజేసి తన అసంతృప్తిని బయటపెట్టారు. “పార్టీలో నన్ను ఫుట్‌బాల్‌లా తన్నేస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, “ఒకరిని కలిస్తే మరొకరి వద్దకు పంపిస్తున్నారు. తివారీని కలిస్తే రామచందర్ రావును కలవమంటున్నారు. ఆయనను కలిస్తే అభయ్ పాటిల్ వద్దకు వెళ్లమంటున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయ లోపంపై కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ అంతర్గత వ్యవహారాలపై ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.