Public Greevens Kadapa: కొంత మంది ప్రభుత్వ అధికారులు ప్రజా సమస్యలపై నామ మాత్రంగా పని చేస్తున్నారు. వచ్చిన అర్జీదారులు మళ్ళీ మళ్ళీ కడప కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కాళ్లు అరిగేలా కలెక్టరెట్ చుట్టూ తిరగాలా? అలసత్వం వహిస్తే ఛార్జ్ మెమోలతో పాటు క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఇవీ ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహిస్తున్న అధికారులపై కడప కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు. అన్ని శాఖల అధికారులకూ స్పెషల్ క్లాస్ పీకారు కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. సాధారణంగా ఓ జిల్లా కలెక్టర్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం అరుదు. కానీ కొన్ని శాఖల్లో వందలాది సమస్యలు పరిష్కారం కాకుండా మూలన పడిపోవడంతో కలెక్టర్ ఆగ్రహించారు. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల పట్ల ఫైర్ అయ్యారు. కలెక్టర్ మాత్రమే అన్ని సమస్యలపై దృష్టి సారించాలా? అంటూ మండిపాటుకు గురయ్యారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వార్నింగ్ ఇప్పుడు కడప అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: KNL District TDP President: సైకిల్ సీట్ ఛేంజ్..! కర్నూల్ కింగ్ ఎవరు..?
ఇప్పటికే పలు మార్లు హెచ్చరించినా అధికారుల తీరు మారలేదని తెలుస్తోంది. దీంతో ఒకటి, రెండు సార్లు చెప్పి చూశాం, అయినా మార్పు రాలేదు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కనపడితే ఇకపై చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ ఇచ్చారు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. అధికారులు స్వయంగా అర్జీదారుల సమస్యలు పరిష్కారం చేయాలి. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలి..! అంటూ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా, రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. ఎండార్స్ ఇచ్చిన అర్జీలకు జిల్లా అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. వివిధ శాఖల ద్వారా అందిన ఆన్లైన్ అర్జీలను చాలా మంది అధికారులు ఇంకా ఓపెన్ చేయడం లేదని, ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. 48 గంటలలో అధికారులందరరూ వివరణ ఇవ్వాలన్నారు. ఎవరైనా ఫిర్యాదుదారుల అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. ఇలా కలెక్టర్ చేత స్పెషల్ క్లాస్ తీసుకున్న అధికారుల్లో ఇకనైనా మార్పు వస్తుందో రాదో చూడాలి.

