Supreme Court: బిహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించిన అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారు తమను తిరిగి జాబితాలో చేర్చుకోవడానికి ఆన్‌లైన్‌లో ఆధార్‌తో సహా ఇతర ధృవపత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్ లేదా నవంబర్‌లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం ఓటర్లకు పెద్ద ఉపశమనం కలిగించింది.
బిహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) వివాదంపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి బెంచ్ విచారణ జరిపింది. ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన సర్వేలో 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయని ఈసీ సుప్రీంకోర్టుకు నివేదించింది. అయితే, ఈ డేటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఈసీ వెబ్‌సైట్‌లో ఓటరు తమ ఆధార్‌కార్డు కాపీ లేదా ఇతర 11 గుర్తింపు పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈసీకి ఆగస్టు 19 వరకు గడువు విధించింది.
Also Read: Narendra Modi: ప్రభుత్వాలను జైలు నుంచి నడపడమేంటి?
పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించినప్పటికీ, రాజకీయ పార్టీలు ఈ సమస్యపై స్పందించకపోవడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు చొరవ తీసుకుని తమ బూత్-లెవల్ ఏజెంట్లతో తొలగించబడిన ఓటర్లకు సహాయం చేయాలని కోరింది. బూత్-లెవల్ ఏజెంట్లకు స్థానికుల గురించి బాగా తెలుసని, వలసదారులు ఎవరో, స్థానికులు ఎవరో వారికి బాగా అర్థం అవుతుందని అభిప్రాయపడింది. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ ఓటరు స్నేహపూర్వకంగా ఉండాలని పునరుద్ఘాటించింది.
బిహార్‌లో ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇది అధికార పార్టీకి అనుకూలంగా ఈసీ పని చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిహార్‌లో “ఓటర్ యాత్ర” చేపట్టారు. ఈ అంశంపై ఇండియా కూటమి పార్లమెంట్‌లో కూడా నిరసనలు తెలిపింది. పేర్ల తొలగింపునకు సరైన కారణాలు లేవని, దీనిపై స్పష్టత కావాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ వివాదానికి తాత్కాలికంగా ముగింపు పలికాయి. ఈ తీర్పు ద్వారా ఈ ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియలో ఆధార్‌కార్డు ఒక కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టమైంది. అయితే, ఇది ఓటరు గుర్తింపునకు పూర్తిగా ఆధారం కాదని కూడా కోర్టు స్పష్టం చేసింది.
