Crime News

Crime News: దారుణం.. బెట్టింగ్ ఆడొద్దని చెప్పినందుకు తండ్రి గొంతులో కత్తితో పొడిచి చంపిన కొడుకు!

Crime News: వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన ఒక కుటుంబాన్ని చీకటిలో ముంచేసింది. బెట్టింగ్ మోజు ఎంత భయంకరమో నిరూపిస్తూ ఓ కుమారుడు స్వంత తండ్రి ప్రాణం తీశాడు.

వివరాల్లోకి వెళ్తే
వనపర్తి జిల్లా ఘన్‌పూర్ మండలం కోతులకుంట తండాకు చెందిన కేతావత్ హనుమంతు (37) భార్య, ఇద్దరు కుమారులు రవీందర్ (19), సంతోష్‌లతో కలిసి గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్‌లో నివసిస్తున్నాడు. మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే పెద్ద కుమారుడు రవీందర్ ఇంటర్ పూర్తయ్యాక ఏ పని చేయకుండా జులాయిలా తిరుగుతూ బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు వృథా చేయడం మొదలుపెట్టాడు. అప్పుల పాలవుతూ కుటుంబంపై భారం మోపాడు. చిన్న కుమారుడి చదువుకు డబ్బుల్లేక హనుమంతు స్వగ్రామంలో భూమి తాకట్టు పెట్టి రూ.6 లక్షలు తెచ్చాడు.

ఈ డబ్బులపై కన్నేసిన రవీందర్, బ్యాంకులో వేస్తే భద్రంగా ఉంటుందని నమ్మబలికి తన అకౌంట్‌లో రూ.2.5 లక్షలు జమ చేయించుకున్నాడు. కానీ ఆ మొత్తం మొత్తాన్ని బెట్టింగ్ యాప్‌లో పెట్టి కోల్పోయాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని తండ్రి అడుగుతుండగా సాకులు చెబుతూ తప్పించుకునేవాడు. ఈ కారణంగా తండ్రి-కొడుకుల మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవి.

చివరికి మంగళవారం మధ్యాహ్నం పరిస్థితి దారుణానికి దారి తీసింది. తండ్రి డబ్బుల గురించి మళ్లీ నిలదీయగా, తన స్నేహితుడు డబ్బులు ఇవ్వబోతున్నాడని చెప్పి ఎన్టీఆర్ నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. “సర్‌ప్రైజ్ ఇస్తాను” అంటూ తండ్రి కళ్లకు గంతలు కట్టి, ముందే తెచ్చుకున్న కత్తితో గొంతులో పొడిచాడు. గాయాల కారణంగా హనుమంతు అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రవీందర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన మరోసారి బెట్టింగ్ మోజు ఎంతటి విషాదానికి దారి తీస్తుందో చూపించింది. ఒక్క కుటుంబాన్నే కాక సమాజాన్నే కుదిపేస్తున్న ఈ వ్యసనంపై కఠిన చర్యలు అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *