Vijay: తనపై ఎంత విమర్శలు వచ్చినా, వాటిని తాను ఎదుగుదలకు ఇంధనంగా మలుచుకుంటానని టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ తమిళ నటుడు విజయ్ స్పష్టం చేశారు. మధురైలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“మా భావజాల శత్రువు బీజేపీ, రాజకీయ ప్రత్యర్థి డీఎంకే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీ మా టీవీకే, డీఎంకే మధ్యే జరుగుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపు తడుతూ ప్రజల మద్దతు సాధిస్తాం. ఈ ఎన్నికల్లో విప్లవం సృష్టించేది టీవీకేనే” అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు.
మధురై ఈస్ట్ నుంచి తానే పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. “కులం కాదు, మతం కాదు – తమిళుడికే ప్రాధాన్యం” అన్న నినాదాన్ని ఆయన నొక్కిచెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని ఖండించారు. “మనుగడ కోసం ఇతర పార్టీలు పొత్తులు పెడతాయి, కానీ టీవీకే మాత్రం ఆరెస్సెస్ ముందు తలవంచదు. తమిళ అస్తిత్వాన్ని ప్రతిపక్షాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కచ్చతీవులను శ్రీలంక ఆధిపత్యం నుంచి విముక్తం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఢిల్లీలో రహస్య సమావేశాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఆయన పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
2024 ఫిబ్రవరిలో టీవీకే స్థాపన తరువాత విజయ్ నిర్వహించిన ఇది రెండో మహాసభ. గత సంవత్సరం విల్లుపురం జిల్లా విక్రవందిలో తొలి సభను నిర్వహించారు.

