Anil Ambani: ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ ఉచ్చు బిగుస్తున్నదా? రూ.17 వేల కోట్ల రుణాల మోసానికి సంబంధించిన కేసులో అనిల్ అంబానీకి, ఆయన సంస్థలకు ఇబ్బందులు ఉంటాయా? అంటే అవుననే తెలుస్తున్నది. ఈ రోజే (ఆగస్టు 5) ఈడీ అధికారుల ఎదట విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచి ముంబైకి బయలు దేరి వెళ్లినట్టు సమాచారం.
Anil Ambani: అనిల్ అంబానీ రూ.17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో ఆగస్టు 5న విచారణకు హాజరు కావాలని ఆగస్టు ఒకటినే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులను జారీ చేశారు. గత వారం రిలయన్స్ గ్రూప్‌తో సంబంధం ఉన్న 50 కంపెనీలతోపాటు మరో 25 మందితో ముంబైలోని దాదాపు 35 చోట్ల ఈడీ అధికారులు దాడులను జరిపారు. సీబీఐ దాఖలు చేసిన రెండు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అధికారులు ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తున్నది.
Anil Ambani: బ్యాంకులకు రుణాల ఎగవేత కేసుల్లో అనిల్ అంబానీకి గతంలోనే లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. రూ.3 వేల కోట్ల రుణ మోసం కేసులో ఆయనకు ఈ నోటీసులు అందాయి. అదే విధంగా అనిల్ అంబానీ కంపెనీలకు లోన్లు ఇచ్చిన వివిధ బ్యాంకులకు ఈడీ అధికారులు లేఖలు రాశారు. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యునికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్‌కు రుణాలు ఇచ్చిన 13 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు ఆ లేఖలు రాసినట్టు తెలుస్తున్నది.
Anil Ambani: రుణాల ఎగవేతకు సంబంధించిన వివరాలను తమకు పంపాలని ఆయా బ్యాంకులను ఈడీ అధికారులు కోరినట్టు సమాచారం. రుణాలకు సంబంధించి కొందరు బ్యాంకు అధికారులను కూడా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. 2017 నుంచి 2019 వరకు ఎస్ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించినట్టు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో వాస్తవాలు తేలితే అనిల్ అంబానీకి, ఆయన సంస్థలకు ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.