Yemen Coast

Yemen Coast: యెమెన్ తీరంలో ఘోర పడవ ప్రమాదం, 68 మంది ఆఫ్రికన్ వలసదారుల మృతి

Yemen Coast: మెరుగైన జీవితం కోసం స్వదేశం వదిలి వస్తున్న వలసదారుల పాలిట యెమెన్ తీరం మృత్యుకూపంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున యెమెన్ తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మొత్తం 154 మంది ఆఫ్రికన్ వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడటంతో, కనీసం 68 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 74 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వలస సంస్థ (IOM) వెల్లడించింది.

అబ్యాన్ ప్రావిన్స్‌లోని అడెన్ గల్ఫ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ పడవలో ఎక్కువగా ఇథియోపియన్ వలసదారులు ఉన్నారని యెమెన్‌లోని అంతర్జాతీయ వలస సంస్థ అధిపతి అబ్దుసత్తోర్ ఎసోయెవ్ తెలిపారు. ప్రమాదం నుంచి కేవలం 12 మంది మాత్రమే సురక్షితంగా బయటపడగలిగారని, వీరిలో పదకొండు మంది ఇథియోపియన్లు కాగా, ఒకరు యెమెన్‌కు చెందిన వ్యక్తి అని సీనియర్ ఆరోగ్య అధికారి అబ్దుల్ ఖాదిర్ బజమీర్ చెప్పారు. మిగిలిన వారికోసం సహాయక చర్యలు, గాలింపు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మృతదేహాలు తీరానికి కొట్టుకువస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.

హార్న్ ఆఫ్ ఆఫ్రికా (ఇథియోపియా, సోమాలియా, ఎరిట్రియా వంటి దేశాలు) నుండి సౌదీ అరేబియా లేదా ఇతర గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వలసదారులకు యెమెన్ ప్రధాన రవాణా మార్గంగా ఉంది. అయితే ఈ సముద్ర మార్గం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా, అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాలలో ఒకటిగా IOM పదేపదే హెచ్చరిస్తోంది. స్మగ్లర్లు తరచుగా ప్రమాదకరమైన, రద్దీగా ఉండే పడవల్లో వలసదారులను తరలిస్తుంటారు. దశాబ్దానికి పైగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్ గుండా ప్రయాణం అత్యంత ప్రమాదకరమని తెలిసినా, మెరుగైన బతుకు దెరువు కోసం వలసదారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

Also Read: Joe Root: సంగక్కర రికార్డును బ్రేక్ చేసిన రూట్

ఇటీవలి నెలల్లో యెమెన్ తీరంలో అనేక బోటు ప్రమాదాలు జరిగాయి, వందల సంఖ్యలో వలసదారులు మరణించారు లేదా గల్లంతయ్యారు. గత మార్చి నెలలో యెమెన్, జిబౌటి తీరాల్లో నాలుగు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనల్లో ఇద్దరు వలసదారులు చనిపోగా, 186 మంది గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వలస సంస్థ (IOM) నివేదించింది. 2024లో ఇప్పటివరకు దాదాపు 60,000 మందికిపైగా వలసదారులు ఈ మార్గం ద్వారా యెమెన్‌కు చేరుకున్నారని IOM గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023లో ఈ సంఖ్య 97,200గా ఉంది. సముద్ర గస్తీ పెరగడం వల్ల ఈ సంఖ్య కొంత తగ్గినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ తాజా ఘటన వలసదారుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. మెరుగైన భవిష్యత్తు కోసం కట్టుకున్నవారినీ, పుట్టిన గడ్డను వదిలి వెళ్తున్న నిరుపేద వలసదారులకు సురక్షితమైన ప్రయాణ మార్గాలు కల్పించడం, మానవ అక్రమ రవాణాను అరికట్టడం అత్యవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *