Harish Rao

Harish Rao: బాధితులకు కోటి రూపాయలు ఇస్తామన్న రేవంత్.. కానీ ఇచ్చింది 10 లక్షలు

Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించారు. ఇటీవల సంచలనం సృష్టించిన సిగాచి ప్రమాదం నేపథ్యంలో అక్కడి బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టరేట్‌కు చేరిన ఆయన, అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

“సిగాచి ఘటనలో మొత్తం 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఎవరికి కూడా ఆ మొత్తంలో పరిహారం అందలేదు,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Parineeti Chopra: నా భర్త ఎప్పటికీ ప్రధాని కాలేరు.. పరిణీతి కీలక వ్యాఖ్యలు

అంతేకాకుండా, కొంతమందికి కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చి, సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. బాధితులు ఎవరిని సంప్రదించాలో కూడా తెలియక విసిగిపోతున్నారనీ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మానసికంగా తీవ్రంగా వేదన అనుభవిస్తున్నారనీ తెలిపారు.

“బాధిత కుటుంబాలతో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మరణించిన వారి డెత్‌ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కూడా అధికారులు జాప్యం చేస్తున్నారు,” అని హరీష్ రావు పేర్కొన్నారు.

ప్రభుత్వ స్పందన పూర్తిగా బాధ్యతారహితంగా ఉందని ఆరోపించిన ఆయన, బాధితులకు పూర్తి పరిహారం ఇచ్చే వరకు ఈ విషయాన్ని వదలబోమని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *