Instagram Love: నల్గొండ ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన అందరినీ కదిలిస్తోంది. 15 నెలల చిన్నారిని బస్‌స్టాండ్‌లో వదిలేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఏం జరిగింది?
హైదరాబాద్‌కు చెందిన నవీన్ అనే మహిళకు ఇప్పటికే పెళ్లయి, 15 నెలల బాబు ధనుష్ ఉన్నాడు. అయితే, నల్లగొండ పాతబస్తీకి చెందిన ఓ యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడి, అది క్రమంగా ప్రేమగా మారింది. ప్రియుడితో జీవితం గడపాలనుకున్న ఆమె, భర్తను, బిడ్డను వదిలేసి వెళ్లిపోవాలని ప్లాన్ వేసింది.
నిన్న ఆమె తన బాబుతో కలిసి నేరుగా నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌కి వెళ్లి, బస్ స్టాండ్‌లోనే చిన్నారిని వదిలేసి ప్రియుడితో బైక్‌పై వెళ్లిపోయింది. అమ్మ కోసం ఏడుస్తూ బిక్కుబిక్కుమంటున్న బిడ్డను గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సీసీ కెమెరాల ఆధారంగా తల్లి ఆనవాలు
టూ టౌన్ ఎస్సై సైదులు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే బస్టాండ్‌కి చేరుకుని, అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ వీడియోను చూపించగా, బిడ్డ “మమ్మీ” అంటూ గుర్తించాడట. బైక్ నెంబర్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు, ఆ బైక్ ఓ వ్యక్తికి చెందినదని, అతని స్నేహితుడు తీసుకెళ్లాడని తెలుసుకున్నారు. ఆ యువకుడిని ప్రశ్నించగా, ఇన్‌స్టాగ్రామ్ ప్రేమకథ బయటపడింది.
భర్తకు అప్పగించిన బిడ్డ
మహిళను, ఆమె ప్రియుడిని, భర్తను పోలీస్ స్టేషన్‌కి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బిడ్డను తండ్రి, అంటే మహిళ భర్తకు అప్పగించారు.
సామాజిక ఆవేదన
ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా మోజు, ఆన్‌లైన్ ప్రేమలతో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. పేగు బంధాన్ని మరిచి, క్షణిక మోజు కోసం తల్లులు సొంత పిల్లలనే వదిలేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

