Raj Thackeray: ముంబై మాతోశ్రీలో 13 సంవత్సరాల తర్వాత అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఇంటికి వెళ్లి ఆయన 65వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణం తర్వాత రాజ్ మొదటిసారిగా మాతోశ్రీలో అడుగుపెట్టడం ఇది.
విభేదాలు పక్కన పెట్టిన బంధువులు
2005లో శివసేనలో అంతర్గత విభేదాల కారణంగా రాజ్ థాకరే పార్టీ నుంచి బయటకు వచ్చి ఎంఎన్ఎస్ను స్థాపించారు. అప్పటి నుంచి ఇద్దరు బంధువులు వేర్వేరు రాజకీయ మార్గాల్లో నడిచారు. కానీ ఇటీవల ఇద్దరూ కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంపై పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేసే నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడారు.
జూలై 5న ముంబై వర్లీ డోమ్‌లో జరిగిన ‘ఆవాజ్ మరాఠీచా’ ర్యాలీలో ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవడం, వేదికపైనే కౌగిలించుకోవడం, ప్రజల్లో ఐక్యతకు కొత్త సంకేతాలను ఇచ్చింది.
రాబోయే ఎన్నికల్లో కూటమి?
స్థానిక ఎన్నికల్లో ఎంఎన్ఎస్ – శివసేన (యూబీటీ) కలిసి పోరాడే అవకాశం ఉందని ఇరు పార్టీల నాయకులు సంకేతాలు ఇచ్చారు. ఉద్ధవ్ మాట్లాడుతూ, “మరాఠీ గౌరవం కోసం మేము కలిసి పోరాడతాం” అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Salaar 2: సలార్ 2 పై కొండంత హైపెక్కించిన పృథ్వీరాజ్!
రాజకీయ నాయకుల శుభాకాంక్షల వర్షం
ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సహా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “మహారాష్ట్ర ప్రజల హక్కుల కోసం మనం కలిసి పోరాడతాం” అని పేర్కొన్నారు.
2012లో గుర్తిండిపోయే కలయిక
2012లో లీలావతి ఆసుపత్రిలో ఉద్ధవ్ యాంజియోప్లాస్టీ తర్వాత రాజ్ థాకరే ఆయనను ఇంటికి తీసుకెళ్లిన ఘటన, కుటుంబ బంధాన్ని మళ్లీ ప్రదర్శించింది. ఆ సమయంలో కూడా ఇద్దరు బంధువులు సోదరుల్లా కలుసుకున్నారని కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు.
రాజకీయ సమీకరణలకు నాంది?
రాజ్ – ఉద్ధవ్ స్నేహపూర్వకంగా కలవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ కలయిక బీజేపీ – శిండే శివసేన కూటమికి పెద్ద సవాల్ అవుతుందని అంటున్నారు.

