Mavo Party On Hidma Safty: మావోయిస్ట్ పార్టీలో కీలక నేతగా ఉన్న పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు PLGA ఫ్లాటూన్ కమాండర్ మాడవి హిడ్మాను టార్గెట్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర భద్రత బలగాలు విసృతంగా కూంబింగ్ చేస్తున్నాయి. దీంతో హిడ్మా భద్రతపై మావోయిస్టు పార్టీ హైఅలెర్ట్ గా ఉన్నట్లు సమాచారం. సుక్మా జిల్లా పువ్వర్తికి చెందిన మడావి హిడ్మా దండకారణ్యంలో చేపట్టిన ప్రతి ఆపరేషన్ కూడా సంచలనమే. ఇప్పటి వరకు హిడ్మా నాయకత్వంలో చేసిన దాడుల్లో 200కు పైగా కేంద్ర బలగాలలు మృత్యువాత పడినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిడ్మా గత కొంత కాలంగా స్వీయ రక్షణ చర్యలపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఆయన బృందంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కేడర్‌ను తప్పించి, వారిని మావోయిస్టు పార్టీలోని ఇతర విభాగాలకు బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. తనకు అత్యంత నమ్మకమైన వారిని మాత్రమే తన బృందంలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటానని కేంద్ర కమిటీ సమావేశంలో హిడ్మా చెప్పినట్టు సమాచారం. అప్పటి నుండి దండకారణ్య ప్రాంతానికి చెందిన ఆదివాసీ యువతను మాత్రమే తన బృందంలో నియమించుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తన టీంలో ఎవరెవరు ఉండాలో ఆయనే స్వయంగా సెలక్ట్ చేసుకుంటున్నారట.
Also Read: Hyderabad: కొండాపూర్‌లో రేవ్ పార్టీ భగ్నం: 11 మంది అరెస్ట్
మడావి హిడ్మాకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందట. దగ్గరగా ఉండే ఏ-టీమ్‌లో 10 నుండి 12 మంది సభ్యులు, మధ్యలో ఉండే బీ-టీమ్‌లో 20 నుండి 22 మంది, వెలుపలి రక్షణ వలయంలో 20 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారట. దళంలో ఇతరులకు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడని, ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేస్తారని చెబుతారు. హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం ఇద్దరు సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం. ఎక్కడైనా క్యాంప్ వేసినా అందరితో కలివిడిగా ఉండకపోగా, ప్రత్యేక క్యాంపులో ఉంటాడట. హిడ్మాను ఎవరైనా కలవాలంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాలని సమాచారం. కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం 6 నెలలకోసారి కూడా హిడ్మా కనిపించడని తెలుస్తోంది. ఆయన వ్యక్తిగత వివరాలు బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుండగా, పొలిటికల్ వింగ్ కంటే ఆర్మీ విభాగంపైనే ఎక్కువగా మక్కువ చూపిస్తాడట హిడ్మా. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ-1కి కమాండర్‌గా కొనసాగుతున్నాడు హిడ్మా. దండకారణ్య ప్రాంతం హిడ్మా అడ్డాగా ఉందనీ విశ్లేషకులు అభిప్రాయ పడతారు. ఇప్పటి వరకు మడావి హిడ్మాను కేవలం ఒక్కసారి మాత్రమే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత బయటకు వచ్చిన హిడ్మా ఇంతవరకూ పోలీసులకు చిక్కలేదు.

