Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. సాయంత్రం 7:49 గంటల ప్రాంతంలో వచ్చిన ఈ ప్రకంపనల కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. హర్యానాలోని ఝజ్జర్ వద్ద భూకంప కేంద్రం నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది.
ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీతో పాటు హర్యానాలోని రోహ్తక్, బహదూర్గఢ్, ఇతర సమీప ప్రాంతాల్లోనూ ప్రకంపనలు అనుభవించబడ్డాయి.
గమనించదగ్గ విషయం ఏంటంటే, గత రెండు రోజుల్లో హర్యానాలో ఇది రెండో భూకంపం. గురువారం ఉదయం కూడా ఝజ్జర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అప్పట్లోనూ ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.
ప్రస్తుతం ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, వరుస భూకంపాలు ప్రజల్లో ఆందోళనకు కారణంగా మారుతున్నాయి.
