Cm chandrababu: బనచకర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ప్రాధాన్యత చూపించారు. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం “కృష్ణమ్మకు జలహారతి” ఇచ్చి, ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “రాయలసీమను కరువురహిత ప్రాంతంగా మార్చి, రతనాలసీమగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నాం” అన్నారు.
రెజర్వాయర్లు ఆధునిక దేవాలయాలు అని అభివర్ణించిన సీఎం చంద్రబాబు, 2019లో తాము తిరిగి అధికారంలోకి వచ్చుంటే పోలవరం ప్రాజెక్టు ఇప్పటిదాకా పూర్తయ్యేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీమ ప్రాజెక్టులకు కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామని వివరించారు.
సాగునీటిపై హక్కు టీడీపీదే అని స్పష్టం చేసిన సీఎం, సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి జలాలే రాయలసీమకు సాగునీటి కొరత తీర్చగలవని వివరించారు. ప్రస్తుతం కృష్ణా డెల్టాకు కూడా గోదావరి జలాలే అందిస్తున్నామని చెప్పారు.
ఈ ప్రకటనలతో సీఎం చంద్రబాబు రాయలసీమలో సాగునీటి ప్రాధాన్యతను మరింతగా దృష్టికి తెచ్చారు. ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరించి, తాము చేపట్టిన చర్యలు పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఈ పర్యటన కీలకంగా నిలిచింది.