Ys sharmila : చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ఇద్దరూ దాసోహమయ్యారని ఆరోపిస్తూ, కేంద్రాన్ని నిలదీయగల ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉన్నదని స్పష్టం చేశారు.
జూన్ నెలలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 2,500 కిలోమీటర్ల పర్యటన చేసినట్టు ఆమె తెలిపారు. రాష్ట్ర విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కినప్పటికీ, రాష్ట్ర నాయకులెవరూ కేంద్రాన్ని ప్రశ్నించలేదని మండిపడ్డారు.
“మోదీ అధికారంలోకి రావడానికి చంద్రబాబే కారణం. అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదు. జగన్ మాట్లాడుతూ మెడలు వంచుతామని చెప్పి, చివరికి తన మెడనే మోదీ ముందు వంచారు” అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ ఇప్పటికీ మోదీకి ఏ మాత్రం విరుద్ధంగా మాట్లాడకుండా, కేవలం చంద్రబాబుపై విమర్శలు చేస్తూ దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41 మీటర్లకు కుదిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏ ఎంపీ స్పందించకపోవడం దారుణమని షర్మిల వ్యాఖ్యానించారు. రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని గుర్తుచేశారు.
“విభజన హామీలు నెరవేర్చకపోయినా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మోదీకి మద్దతు పలకడం బాధాకరం” అని షర్మిల పేర్కొన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా నిలిచారని, కానీ జగన్ మాత్రం బీజేపీకి గులాంగా మెలుగుతున్నారని ధ్వజమెత్తారు.
రాబోయే నాలుగేళ్లలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. “రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు, రాష్ట్రానికి సేవ చేయాలనుకునేవారు కాంగ్రెస్‌లోకి రావాలి” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే నాయకులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పారు.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, వైఎస్సార్ చేసిన త్యాగాలు దేశానికే మార్గదర్శకమని పేర్కొన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందేనని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్ నాయకత్వంలో పార్టీ తిరిగి బలపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

