Media vs Politics: మహాన్యూస్ ఛానల్‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి రాజకీయ, మీడియా వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఫోన్ ట్యాపింగ్ లాంటి సున్నితమైన అంశాలపై మీడియా చర్చలు, ఊహాగానాలు సహజం. కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయి దాడి చేయడం ప్రజాస్వామ్యంలో దారుణం. ఈ దాడి ద్వారా మహాన్యూస్‌ను భయపెట్టాలని బీఆర్ఎస్ భావించినా మహాన్యూస్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ దాడితో మహాన్యూస్ చానల్ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ, మరింత ఉధృతంగా తమ వాయిస్ వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ఘటన బీఆర్ఎస్‌కు చెడ్డ పేరును తెచ్చిపెడితే, మహాన్యూస్‌కు గొంతుకకు మరింత బలాన్నిచ్చింది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహాన్యూస్ వెన్ను చూపలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత, దాడులతో మీడియాను అణచివేయాలని చూస్తోంది. ఈ దాడి వెనుక కేటీఆర్ పాత్ర ఉందని స్పష్టమౌతోంది. ఆయన హెచ్చరిస్తూ ట్వీట్ చేసిన కాసేపటికే దాడి జరిగింది. తర్వాత, భౌతిక దాడులు సరికాదని మరో ట్వీట్‌తో నాలుక మడతేశారు కేటీఆర్. ఈ వ్యవహారం కేటీఆర్‌కు తెలియకుండా జరిగే అవకాశం లేదని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. పైగా దాడిని సమర్థించుకుంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగుతున్నారు. మరిన్ని దాడులకు లిస్ట్ రాసుకున్నామని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. కొందరు నేతలు కూడా ఇలాంటి పోస్టులతో రెచ్చగొడుతున్నారు. తప్పును కవర్ చేసుకునే క్రమంలో తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తోంది బీఆర్ఎస్.
Also Read: CM Chandrababu: సీఎం చంద్రబాబు: క్వాంటమ్ కంప్యూటింగ్‌ను అందిపుచ్చుకోవాలి
Media vs Politics: ప్రజాస్వామ్యంలో దాడులు సమర్థనీయం కావు. సామాన్య ప్రజలు ఇలాంటి హింసను సమర్థించరు. రాజకీయ పార్టీలు దాడులతో మీడియాని భయపెట్టాలని చూస్తే మూర్ఖత్వమే అవుతుంది. ఇది వారికే నష్టం తెస్తుంది. బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీడియా ఛానళ్లను బ్యాన్ చేయించడం, జర్నలిస్టులను అరెస్టు చేయించడం చేసింది. ఇప్పుడు మీడియాపై దాడి చేసి, తమని ప్రశ్నించే గొంతే లేకుండా చేయాలని భావిస్తే, అది సెల్ఫ్ గోల్ మాత్రమే అవుతుంది. ప్రజలు గతాన్ని మర్చిపోలేదు. జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడానికి మహాన్యూస్ చానల్‌కు కొంత టైమ్ పట్టొచ్చేమో. కానీ బీఆర్‌ఎస్‌పై పడిన మరక.. చరిత్రలో మాసిపోదు.
ఈ దాడుల వెనుక కార్యకర్తలను రెచ్చగొట్టిన నేతలున్నారు. కానీ, జైలు పాలయ్యేది కార్యకర్తలే. వారి కుటుంబాలు బాధలు పడతాయి, కానీ నేతలు సుఖంగానే ఉంటారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టినవారు ఇప్పుడు తమ హ్యాండిల్స్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్నారు. కానీ, కార్యకర్తలు కేసుల్లో చిక్కుకున్నారు. పార్టీ న్యాయ సాయం చేయవచ్చు, కానీ కోర్టుల చుట్టూ తిరగాల్సింది కార్యకర్తలే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఘర్షణలకు దిగారంటే ఆ సందర్భం వేరు. కానీ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దాడులు కార్యకర్తల భవిష్యత్తును నాశనం చేస్తాయి. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది కార్యకర్తలే.