Visakhapatnam Water Emergency: విశాఖపట్నంలో ప్రస్తుతం తాగునీటి ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడింది. జీవీఎంసీ (GVMC) పరిధిలో ఉన్న 98 డివిజన్లలో లక్షలాది ప్రజలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఒక్కటే – వాటర్ సప్లై ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పట్టడం.
నీటి సరఫరాకు బ్రేక్ – నగరాన్ని పట్టేసిన వాకింగ్ విత్ బకెట్ సీన్
ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు కల్పించినా, తాగునీటి అవసరం తీరకపోతే ప్రజలు ఎలా బాధపడతారో ఇప్పుడు విశాఖలో చూస్తున్నాం. ప్రతి వీధిలో బకెట్లతో నిలబడి నీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజలు కనిపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బిందెడు నీరూ దొరకక ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ప్రధాన నీటి మూలాలు మూతపడ్డాయి
ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ వంటి ముఖ్యమైన జలాశయాల నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిపివేశారు. ఈ పంపింగ్ వ్యవస్థలు 30 గంటలుగా నిలిచిపోయాయి. దీంతో నగరంలో ఉన్న నీటి ట్యాంకులు పూర్తిగా ఖాళీ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Konda Murali: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందుకు కొండా మురళి.. ఆ ఎమ్మెల్యేలపై మంత్రి సురేఖ అనుచరుల ఫిర్యాదు
ట్యాంకులు నింపాలంటే కనీసం 10 గంటలు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తిరిగి నీటి సరఫరా ప్రారంభించాలంటే, ట్యాంకులను నింపేందుకు కనీసం 10 గంటల సమయం పడుతుంది. కానీ ఉద్యోగుల సహకారం లేకుండా పంపింగ్ ప్రక్రియ మొదలుపెట్టితే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం ప్రయత్నాల్లో పడుతోంది కానీ పరిష్కారం ఇంకా దూరం
ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపినా అవి ఇంకా ఫలించలేదు. ఉద్యోగులు తమ డిమాండ్లపై పట్టుబడుతున్నారు. వారితో మరోసారి మేయర్ చర్చలు జరిపే అవకాశం ఉంది. చర్చలు సఫలమైతేనే నీటి సరఫరా తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీరు
GVMC ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు పంపిణీ చేస్తున్నారు. కానీ ఇది చాలా పరిమితంగా ఉంది. అవసరాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ తాత్కాలిక సదుపాయం చాలడం లేదు.