Engineering Counselling: తెలంగాణ రాష్ట్రంలో బీఈ, బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం (జూన్ 29) నుంచి ప్రారంభమైంది. ఈసారి మొత్తం మూడువిడతల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో చైర్మన్ బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన తదితరులు షెడ్యూల్‌ను ఖరారు చేసి విడుదల చేశారు.
మాక్ సీటు అలాట్మెంట్ – కొత్తగా ప్రవేశం
ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు సీటు వస్తే ముందుగానే తెలుసుకునే అవకాశం కల్పించేందుకు మాక్ సీటు అలాట్మెంట్ విధానాన్ని ప్రారంభించారు. జేఈఈలా, ఇప్పుడు ఎఫ్‌సెట్‌లో కూడా వెబ్ ఆప్షన్లు మార్చుకునే ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
మూడు విడతల కౌన్సెలింగ్ వివరాలు
-
మొదటి విడత: నేటి నుంచే ప్రారంభం. మాక్ సీట్లు చూసిన తర్వాత అవసరమైతే వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు.
-
రెండో విడత: సీట్లు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆయా కాలేజీల్లో ఒరిజినల్ TC, ఇతర జిరాక్స్ సర్టిఫికెట్లు సమర్పించి రిపోర్ట్ చేయాలి. ఈ దశలో సీటు రద్దు చేస్తే ఫీజు తిరిగి వస్తుంది.
-
చివరి విడత: సీటు రద్దు చేసే అవకాశం ఉండదు. ఫీజు కూడా రీఫండ్ అవదు.
ఇంటర్నల్ స్లైడింగ్ – కన్వీనర్ కోటాలోనే
ఇంతకుముందు కాలేజీలు స్వయంగా నిర్వహించేవి కాని, ఈసారి కన్వీనర్ కోటాలో ఆగస్టు 18, 19 తేదీల్లో స్లైడింగ్‌కు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 22, 23న సీట్లు కేటాయించనున్నారు. స్లైడింగ్ ద్వారా బ్రాంచ్ మార్చుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా వర్తిస్తుంది.
ఇది కూడా చదవండి: NRI Husband Harassment: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైకో NRI భర్త… ఫ్రెండ్లీగా విడిపోదామంటూ
కొత్త వర్సిటీల్లో సీట్ల భర్తీ
ఈ విద్యాసంవత్సరం నుంచి పాలమూరు వర్సిటీ, శాతవాహన వర్సిటీ, కొత్తగూడెం ఎర్త్‌సైన్స్ వర్సిటీల్లో ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభమవుతున్నాయి. ఇందులో సీట్ల భర్తీ ఈసారి నుంచే జరగనుంది.
స్పాట్ అడ్మిషన్లు – ఆఖరి అవకాశం
మూడవ విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన సీట్ల కోసం ఆగస్టు 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలు విడుదల చేస్తారు. గతేడాది మాదిరిగానే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.