Kavita: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహుజన హక్కుల సాధన కోసం మరోసారి కఠినంగా ముందుకు వచ్చారు. శుక్రవారం ఆమె నివాసానికి విచ్చేసిన కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలేను ఆమె ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లు, బీసీల సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.
తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లులను ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదానికి పంపిందని కవిత తెలిపారు. ఈ బిల్లులకు త్వరగా రాష్ట్రపతి ఆమోదం రావాల్సిందిగా కేంద్రం చొరవ చూపాలంటూ మంత్రి అథవాలేకు ఆమె వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ –
“బహుజన వర్గాలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నా, వాటికి సరైన ప్రాతినిధ్యం లభించకపోవడం ఆందోళనకరం. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వారి జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం లేకపోవడం సమాజంలో అసమానతలకు దారి తీస్తోంది. అందుకే బీసీలకు న్యాయమైన హక్కులు లభించేలా రిజర్వేషన్లు తప్పనిసరి. బీసీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తక్షణమే రావాలి” అని అన్నారు.
దేశవ్యాప్తంగా ఓబీసీలు దీర్ఘకాలంగా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమం దేశానికి దిశానిర్దేశకంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ భేటీ ద్వారా బీసీ ఉద్యమం మరింత బలపడే అవకాశముందని పలు వర్గాలు విశ్లేషిస్తున్నాయి.