YCP Stories on Singayya Case: వైసీపీ అల్లుతున్న రాజకీయ కథనాలు హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉంటున్నాయా అంటే… అవుననే అంటున్నారు పొలిటికల్ పండితులు. బాబాయ్ హత్య కేసులో బాత్రూమ్‌లో జారిపడ్డారు, గుండెపోటు, రక్తపు వాంతులు, నారాసుర రక్త చరిత్ర, సునీత కుట్ర అంటూ మెలికలు తిరిగిన కథలు చెప్పిన వైసీపీ, ఇప్పుడు దళిత వృద్ధుడు సింగయ్యను కారుతో తొక్కి చంపిన ఘటనలో కొత్త స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగింది. జగన్ రెడ్డి స్వయంగా తన కారు కింద పడే సింగయ్య చనిపోయాడని ఒప్పుకున్నారు. ఘటన జరిగిన రోజే తనకు తెలుసని ట్వీట్ చేశారు. కానీ, సదరు వీడియోలు బయటకు రాకముందు మాత్రం కిక్కురుమనలేదు జగన్ మోహన్‌రెడ్డి. వీడియోలు వెలుగులోకి వచ్చాకే ఒప్పుకున్నారు. అంటే, మొదట ఇతరులపై నెపం తోసేసే ఆలోచనలో ఉన్నారనే కదా అర్థం… అంటూ నిలదీస్తున్నారు కూటమి నేతలు.
ప్రమాదం జరిగిన తర్వాత సింగయ్యను రోడ్డు పక్కన వదిలేసి పారిపోవడం ఏంటి? ఆస్పత్రికి తీసుకెళ్లే బాధ్యత స్వీకరించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది కదా? బదులుగా, కేసు రాజుకుంటుందని తెలిసి పది లక్షల రూపాయలు అంబటి ద్వారా ఇప్పించి, అదే పెద్ద సాయమన్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తనకు అసలు సెక్యూరిటీనే లేదు.. తనకు సెక్యూరిటీ లేకపోవడం వల్లే జనం చచ్చిపోతున్నారు అంటూ కొత్త కథనం మొదలెట్టారు. జగన్ వాదన ప్రకారం, సరైన భద్రత ఉంటే సింగయ్య కారు దగ్గరకు వచ్చేవాడు కాదట! అసలు జగన్ అక్కడ ఎందుకు ఆగారు? జనాల్ని ఎందుకు పిలిపించుకున్నారు? ఆయన అక్కడ ఆగుతారని ప్రచారం చేసింది ఎవరు? మందని అక్కడికి తరలించింది ఎవరు? ఇదంతా ప్రీ ప్లాన్డ్ షో కాదా? అయినా కారు దగ్గరకు వస్తే తొక్కి చంపేస్తారా? ఇవన్నీ మాకు అనవసరం అన్నట్లు… వైసీపీ వండి వార్చుతున్న కథనాలు చూస్తే, వారి క్రియేటివిటీకి ఎవరైనా ఫిదా కావాల్సిందే.
YCP Stories on Singayya Case: ఏ స్కాం, ఏ నేరం చేసినా అడ్డంగా సాక్షాధారాలతో సహా దొరికిపోవడం వైసీపీ స్పెషాలిటీ. ఇక ఏది కప్పి పుచ్చుకోవాలన్నా చంద్రబాబుకు 10 ప్రశ్నలు అంటూ ముందుకొస్తుంటాయి వైసీపీ క్రియేటివ్ ఆర్ట్స్‌లో పనిచేసే పెయిడ్ బ్యాచ్‌లు. చంద్రబాబుకు 10 ప్రశ్నలు వేస్తే చాలు… మనం తప్పించుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే గత రెండ్రోజులుగా వైసీపీ సొంత మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఈ పది ప్రశ్నల స్ట్రాటజీని కొనసాగిస్తున్నారు. స్వయంగా జగన్ మోహన్ రెడ్డి కూడా 10 పశ్నల సూత్రాన్ని అమలు చేస్తూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. అయినా జగన్ రెడ్డి టూర్లలోనే ఎందుకు ఇలాంటి డ్రామా షోలు జరుగుతాయో ప్రజలు ఆలోచించనంత కాలం… ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదు అంటున్నారు విశ్లేషకులు.
ఎవరు నమ్మినా నమ్మకున్నా.. జగన్ పర్యటనల్లో జన సమీకరణకు టార్గెట్లు, పోస్టర్లు, రోడ్ షోలు… అన్నీ ప్రీ-ప్లాన్డ్‌గా జరుగుతాయనేది పక్కా నిజం. చంద్రబాబు, పవన్, లోకేష్ పర్యటనలపై ఐదేళ్లూ ఆంక్షలు, దాడులు చేసిన వైసీపీ, ఇప్పుడు జగన్‌కు మాజీ సీఎంగా భద్రత ఇస్తున్న ప్రభుత్వంపైనా నిందలు వేస్తోంది. వైసీపీ స్క్రిప్టెడ్ రాజకీయాలు, కరుడుగట్టిన క్రిమినల్ మైండ్‌సెట్‌ను ఎదుర్కోవాలంటే, ప్రభుత్వం అంతే గట్టిగా ఆలోచించాలని… రక్షణ కల్పించాల్సింది జగన్‌కి కాదని, సింగయ్య లాంటి వారికే జగన్ నుంచి భద్రత కల్పించాలని మేధావులు, పరిశీలకులు సూచిస్తున్నారు.