Trump: గత 12 రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు కారణమైన ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధానికి తెరపడనుంది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం వేకువజామున 3.32 గంటలకు (భారత కాలమానం) తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్ట్ చేస్తూ ఈ శుభవార్తను వెల్లడించారు.
ట్రంప్ కీలక ప్రకటన:
ట్రంప్ తన పోస్ట్‌లో ఇజ్రాయెల్, ఇరాన్‌లకు అభినందనలు తెలిపారు. మరో ఆరు గంటల్లో కాల్పుల విరమణ ప్రక్రియ మొదలవుతుందని, 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు. మొదట ఇరాన్ కాల్పులు నిలిపివేస్తుందని, ఆ తర్వాత ఇజ్రాయెల్ దాన్ని అనుసరిస్తుందని తెలిపారు. “ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగి ఉంటే పశ్చిమాసియా మొత్తం నాశనమయ్యేది. కానీ అలా జరగలేదు, ఇక ముందు కూడా జరగదు” అని ట్రంప్ పేర్కొన్నారు.
శాంతి వైపు అడుగులు:
గతంలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ‘ఆపరేషన్ బషరత్ అల్ ఫాత్’ పేరుతో ప్రతీకార దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ వ్యంగ్యంగా స్పందించినా, ఇప్పుడు ఇరాన్ తన పంథాను మార్చుకొని శాంతి వైపు అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌ను కూడా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ప్రోత్సహిస్తానని తెలిపారు.
Trump: ఈ కాల్పుల విరమణ ప్రకటన ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ పెరగడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే, కాల్పుల విరమణ ప్రతిపాదన తమకు రాలేదని ఇరాన్ పేర్కొనడం గమనార్హం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ, ట్రంప్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నారు. “ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని ఆశిస్తున్నాను. అమెరికాతో పాటు మధ్యప్రాచ్యాన్ని, ఇరాన్, ఇజ్రాయెల్‌లను, ప్రపంచాన్ని దేవుడు చల్లగా దీవించుగాక” అని ట్రంప్ తన పోస్ట్‌ను ముగించారు.