Air India: ఎయిరిండియా విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ మరోసారి సాంకేతిక లోపంతో వార్తల్లో నిలిచింది. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఏఐ 315 విమానంలో మంగళవారం అర్ధాంతరంగా సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం గాల్లో ఉన్న సమయంలోనే పైలట్ సమస్యను గుర్తించి వెంటనే అప్రమత్తమై విమానాన్ని తిరిగి హాంకాంగ్ వైపు మళ్లించారు.
విమానం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన కాసేపటికే ఈ లోపం వెలుగు చూసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని గమ్యస్థానానికి తీసుకెళ్లకుండా మళ్లించి హాంకాంగ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం టెక్నికల్ టీమ్ ఈ లోపానికి కారణాలను విశ్లేషిస్తోంది. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా, ఇటీవలే అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఒకటి ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి మళ్లి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదే తరహా మోడల్‌కు చెందిన మరో విమానంలో ఇటీవలి సాంకేతిక లోపం బయటపడడం విమానయాన సంస్థ పై మరోసారి ఉత్కంఠను రేకెత్తించింది.
ఇది కూడా చదవండి: Indians In Iran: ఇరాన్‌లో భారతీయ విద్యార్థుల ఆవేదన.. ‘మమ్మల్ని రక్షించండి ప్లీజ్’
ఇటీవలి కాలంలో ఎయిరిండియా విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటుండటం విమానయాన రంగంలో ఆందోళనకు కారణమవుతోంది. ఇక మరోవైపు, దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల నేపథ్యంలో పలు విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిణామాలు ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
విమానయాన రంగ నిపుణుల అభిప్రాయం:
ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకుంటే అది పెద్ద ప్రమాదాలకు దారి తీయొచ్చు. ఎయిరిండియా వంటి ప్రముఖ సంస్థ ఇలా వరుసగా సాంకేతిక లోపాలకు లోనవడం ఆందోళన కలిగించే విషయం. ప్రత్యేకించి డ్రీమ్‌లైనర్‌లకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలి
ఎయిరిండియా యాజమాన్యం వెంటనే రంగంలోకి దిగిఉన్నత స్థాయి విచారణ చేపట్టి, బోయింగ్ విమానాల నిర్వహణలో తగిన మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.