Harish Rao: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 16 నెలలుగా గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో హరీశ్ రావు ఓ పోస్టు చేశారు. నిధుల లేమి కారణంగా పంచాయతీల ట్రాక్టర్లకు డీజిల్ లేక పనులు ఆగిపోయాయని, పంచాయతీ కార్యదర్శులు ట్రాక్టర్ల తాళాలు అధికారులు వద్దకు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
“ప్రభుత్వం మారితే మార్పు వస్తుందని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ గ్రామాల్లో కనిపిస్తున్న ఈ దుస్థితి అదే మార్పా?” అంటూ సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు. “ఇది మార్పు కాదు… ఏమార్పు!” అంటూ ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలకు క్రమం తప్పకుండా నిధులు అందేవని, అయితే ఇప్పుడు నిధుల కోసం గ్రామాల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన విమర్శించారు. నిధుల కొరత కారణంగా గ్రామీణ అభివృద్ధి పూర్తిగా స్థగించిపోయిందని వ్యాఖ్యానించారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

