Kerala: కేరళలో ఓ మద్యం భరితమైన మోసపు ప్రేమకథ నాటకీయంగా బయటపడింది. ఇప్పటివరకు ఏడుగురిని వివాహం చేసుకుని, వారి బంగారు మంగళసూత్రాలతో ఉడాయించిన ఓ మహిళ ఎనిమిదో పెళ్లికి సిద్ధమవుతుండగా శుక్రవారం అరెస్ట్ చేయబడింది. ఈ మోసకారిణి పేరు రేష్మా చంద్రశేఖరన్, వయస్సు 30 ఏళ్లు. ఆమెకు ఇప్పటికే రెండేళ్ల చిన్నపాప కూడా ఉంది.
ఆర్యనాడ్ ప్రాంతంలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పెళ్లికి ముందరి మేకప్ చేసుకుంటుండగా, స్థానిక పోలీసులు రేష్మాను అదుపులోకి తీసుకున్నారు. పొత్తన్‌కోడ్‌కు చెందిన ఓ యువకుడితో రేష్మా వివాహ నిశ్చయమై ఉండగా, ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన అతను ముందుగా పోలీసులను అప్రమత్తం చేశాడు. దాంతో ఆమె మోసం తీరులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.
పోలీసుల కథనం ప్రకారం, గత నెలలో ఓ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా రేష్మా సదరు యువకుడిని సంప్రదించింది. మధ్యవర్తిగా ఓ మహిళ పరిచయం చేయగా, తరువాత కొట్టాయంలోని ఓ షాపింగ్ మాల్‌లో వారు కలుసుకున్నారు. తన పేరెంట్స్ ఎవరూ లేరని, అనాథనని చెప్పిన రేష్మా, జూన్ 6న జరగనున్న పెళ్లికి తనవైపు నుంచి ఎవరూ రారని చెప్పింది.
అయితే పెళ్లికి ముందురోజు సాయంత్రం, రేష్మా వరుడి స్నేహితుడి ఇంటికి వెళ్లినప్పుడు ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఆ స్నేహితుడి భార్య తన భర్తను అప్రమత్తం చేయడంతో విషయం బయటపడింది. శుక్రవారం ఆమె బ్యూటీ పార్లర్‌కు రాగానే, ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ను తనిఖీ చేయగా, గత వివాహాలకు సంబంధించిన పలు పత్రాలు బయటపడ్డాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
రేష్మా మోసానికి ఉపయోగించిన విధానం చాలా వ్యూహాత్మకంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రతి పెళ్లిలోనూ మొదట కొన్ని రోజులపాటు ఆమె బాగానే ఉండేది. ఆ తర్వాత ఒక్కసారిగా మాయమైపోయేది. సంబంధిత వ్యక్తులు ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఫోన్‌లు ఆఫ్ చేస్తూ ఉండేది.
ఇప్పటి దాకా ఆమె ఏడుగురిని పెళ్లి చేసుకున్నట్లు, ఇంకా మరో రెండు పెళ్లుల కోసం సంప్రదింపులు జరుపుతుందన్న ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. “మేము ఆమె గత భర్తల వివరాలను సేకరిస్తున్నాం. మోసం కేసు నమోదు చేశాం. త్వరలో కోర్టులో హాజరు పరుస్తాం” అని ఒక పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు.

