ఏపీ కేబినెట్ ఈరోజు సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుంది. పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక కొత్తగా తీసుకువస్తున్న మద్యం పాలసీపై కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ విషయంలో అనేక అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారంలోకి వస్తే మద్యం పాలసీని సవరిస్తామని.. తక్కువ రేట్లకు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకువస్తామని కూటమి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా మద్యం పాలసీని తీసుకురావడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పాలసీపై ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తరువాత అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇటీవల బుడమేరు వరదలకు విజయవాడలోని చాలా ప్రాంతాలు అస్తవ్యస్తం అయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతాల్లో మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, బుడమేరు వరద తెచ్చిన బీభత్సం మాత్రం ఇప్పటికీ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. బాధితులకు సహాయం అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ, ఇప్పటికీ చాలామంది ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ బుడమేరు పై కేబినెట్ లో చర్చ జరుగుతుంది. బుడమేరు వరద బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి అనే అంశంపై కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.

