Kunduru Jana Reddy: అనుకున్నది అనుకున్నట్టు జరిగితే తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ఆయనే సీఎం. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి అన్నట్టు పార్టీ ఓటమితో ఆయన ఆశలు అడియాశలు అయ్యాయి. 2018 ఎన్నికల వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని అనంతర రాజకీయ పరిణామాలతో పోటీకి దూరమయ్యాడు.. కాదు కాదు రాజకీలకు రిటైర్మెంట్ ప్రకటించారనే ప్రచారం సాగింది. కానీ మళ్లీ తాజా పాలిటిక్స్‌లో ఆ సీనియర్ నేత కీలకంగా మారారనే టాక్ కాస్త గట్టిగానే సౌండ్ చేస్తోంది. ఇక ఇటీవల పెద్దాయన అధిష్టానానికి రాసిన లెటర్ తాలూకా ప్రకంపనలు అంతా ఇంతా కాదండోయ్. ఏకంగా మంత్రి పదవి ఆశిస్తున్న నేతలకు ఝలక్ ఇచ్చారనే టాక్. ఆయన తీరుతో సొంత జిల్లా నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మరి సైలెంట్ మోడ్‌లో ఉన్న పెద్దాయన యాక్టివ్‌గా మారడానికి కారణమేంటి? ఇంతకీ ఎవరా లీడర్? ఏమిటా కథ? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక శాఖలకు మంత్రిగా కొనసాగిన సీనియర్ నేత నల్గొండ జిల్లాకు చెందిన కుందూరు జానారెడ్డి. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో తన తనయులు ఇద్దరితోనూ పొలిటికల్ అరంగ్రేటం చేయించడమే కాకుండా, ఇద్దర్నీ గెలిచిపించుకుని సక్సెస్ సాధించారు. తాను మాత్రం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని, పోటీకి దూరంగా ఉన్నారు. ఐతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ జానా యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వానికి, పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్‌తో సహా పార్టీకి పెద్దాయన సలహాలు, సూచనలను తప్పక తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Gaddar Film Awards: ఆ రోజే గద్దర్ సినీ అవార్డుల ప్రదానం.. అన్ని క్యాటగిరీల్లో 1248 నామినేషన్లు.. దిల్ రాజు వెల్లడి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం అభ్యర్థి రేస్‌లో సైతం జానారెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు అనే ప్రచారం ఉంది. అలాగే పార్టీలో కొంతమంది లీడర్స్ పదవుల విషయంలో అలక పాన్పు ఎక్కిన సందర్బంలో స్వయంగా ఆయన వారిని బుజ్జగించారన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలో జానారెడ్డి సేవలు పార్టీకి, ప్రభుత్వానికి అవసరం ఉందని అధిష్టానం గుర్తించింది. దీంతోపాటు పెద్దాయన అంటే సొంత పార్టీలోనే కాదు… ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఆయనను గౌరవిస్తూ ఉంటారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఆయన కీ రోల్ ప్రదర్శిస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి తోడు ప్రభుత్వం ముఖ్య పథకాల అమలు విషయంలో గానీ, ఇతర కార్యక్రమాల నిర్వహణ సమావేశాల్లో కానీ.. జానారెడ్డికి ఏ పదవి లేకున్నా పాల్గొంటూ ఉండటంతో.. పార్టీలో ఆయనకున్న ప్రియారిటి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఏ హోదాలో ఆయన ప్రభుత్వ అఫీషియల్ సమావేశాల్లో పాల్గొంటారనే దానిపై కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో జానారెడ్డికి ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇదిలా ఉండగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలు మంత్రి పదవుల్లో ఉన్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవి ఆశిస్తుండడం.. జానారెడ్డికి అడ్డంకిగా మారింది. మరోవైపు పెద్దాయనకు ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా పదవి ఇచ్చేందుకు రంగం సిద్దమైందనే టాక్ వినిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో పాటూ, అదే సామాజిక వర్గానికి చెందిన జానాకి ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తే.. ఒకే జిల్లా నుంచి, ఒకే సామాజిక వర్గం నుంచి నలుగురికి పదవులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకత వస్తుందనేది పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.
దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి చెక్ పెడుతూనే.. తనకు ప్రభుత్వ సలహాదారుగా అవకాశం ఉండేలా జానారెడ్డి కొత్త ఎత్తుగడ వేసి… రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాశారనేది కోమటిరెడ్డి వర్గీయుల ప్రధాన ఆరోపణ. జానారెడ్డి రాసిన లేఖతో పార్టీలో పెద్ద దుమారం లేవడమే గాక, మంత్రివర్గ విస్తరణను పక్కన పెట్టేశారన్న చర్చ జరుగుతోంది. ఇక లేఖ రాయడంపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే జానారెడ్డిపై ఫైర్ అయ్యారు. 25 యేండ్లు మంత్రి పదవి అనుభవించినప్పుడు జానారెడ్డికి ఇతర జిల్లాలు గుర్తుకు రాలేదా? ధర్మరాజుగా ఉండాల్సిన పెద్దాయన ధృతరాష్ట్రుడిగా వ్యవహరిస్తున్నాడంటూ కూడా రాజగోపాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జానారెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందనే ప్రచారం ఊపందుకుంది.
అధిష్టానానికి జానారెడ్డి రాసిన లేఖ… అటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటూనే, ఇటు తాను ప్రభుత్వ సలహాదారు పదవి దక్కించుకునే వ్యూహంలా ఉందని ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి… మంత్రి పదవి ఇస్తామన్న హామీ మేరకు అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి అవకాశమిస్తుందా? లేక జానా రాసిన లేఖతో రాజగోపాల్‌ని పక్కన పెట్టేస్తుందా? అదే విధంగా ప్రచారంలో ఉన్నట్టు జానారెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తుందా? వేచి చూడాలి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఈ ఇద్దరి నేతల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని కాంగ్రెస్ కేడర్‌లో ఆసక్తి నెలకొంది.