Gaddar Film Awards: గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల జ్యూరీ కమిటీ సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ అవార్డుల చైర్మన్ జయసుధ, సమాచార శాఖ ఎండీ హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ తేదీని ప్రకటించారు. జూన్ నెల 14వ తేదీన తెలంగాణ సినీ అవార్డులను ప్రదానం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సమావేశ వివరాలు, అవార్డుల విశేషాలను దిల్ రాజు వివరించారు.
Gaddar Film Awards: హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో అవార్డు ప్రదానోత్సవ తేదీని ప్రకటించినట్టు దిల్ రాజు వెల్లడించారు. హెచ్ఐసీసీ వేదికగా జూన్ 14న అవార్డుల ప్రదానోత్సవ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అందించనున్న ఈ గద్దర్ సినీ అవార్డులకు చిత్ర పరిశ్రమ నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు.
Gaddar Film Awards: సుమారు 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినీ పురస్కారాలను ఇస్తున్నందున ఎంపిక కోసం నిష్ణాతులైన వారితో జ్యూరీ కమిటీని నియమించినట్టు దిల్ రాజు వెల్లడించారు. ఏప్రిల్ 17న జ్యూరీ కమిటీ చైర్మన్, సీనియర్ నటి జయసుధ అధ్యక్షతన సమావేశం జరిగిందని తెలిపారు. నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు.
Gaddar Film Awards: గద్దర్ సినీ పురస్కారాల కోసం అన్ని క్యాటగిరీలకు కలిపి 1,248 నామినేషన్లు అందాయని దిల్ రాజు తెలిపారు. నిష్పక్షపాతంగా నామినేషన్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. జ్యూరీ చైర్మన్ జయసుధ మాట్లాడుతూ ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను సవాల్‌గా తీసుకొని ఎంపిక ప్రక్రియను పూర్తిచేస్తామని చెప్పారు. పురస్కారాల కోసం వ్యక్తిగత విభాగంలో 1172 నామినేషన్లు, ఫీచర్ ఫిల్మ్‌లు, బాలల చిత్రాలు, పరిచయ చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలతోపాటు ఇతర విభాగాలు కలిపి 76 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.