Pemmasani Chandra Shekhar: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఎందరో తెలుగు విద్యార్థులకు చంద్రబాబు ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులను ఆయన స్వయంగా ఆదుకున్నారని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని చర్చిస్తూ పెమ్మసాని అన్నారు, “ఇది చాలామందికి తెలియదు. కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరికి మాత్రమే తెలిసేలా ఈ సహాయాన్ని చేశారు. ఎంతోమందికి ఆయన ఫీజులు కడతారు. ఇది చంద్రబాబు గారి దయగుణానికి, విద్యార్థుల పట్ల ప్రేమకు అద్దం పడుతోంది.”
చంద్రబాబు రాజకీయ నాయకుడే కాకుండా, ఎందరో విద్యార్థుల జీవితాల్లో మార్గదర్శిగా నిలిచారని ఆయన కొనియాడారు. ప్రత్యేకించి అమెరికాలో ఆర్థిక ఇబ్బందులతో చదువు నిలిచిపోయే పరిస్థితి వచ్చినప్పుడల్లా చంద్రబాబు వెంటనే స్పందించి ఫీజులు చెల్లించేలా చూసేవారని తెలిపారు.
అంతేకాకుండా, చంద్రబాబును “నిలువెత్తు నిఘంటువు”గా (Living Dictionary) అభివర్ణించిన పెమ్మసాని, “ఆయన దూరదృష్టి, విజన్ నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. అమెరికాలో స్థిరపడేటప్పుడు ఆయన ప్రసంగాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి,” అని చెప్పారు.
అమరావతి నిర్మాణం, ‘జన్మభూమి’ వంటి సామాజిక కార్యక్రమాలు, ఔటర్ రింగ్ రోడ్ (ORR) వృద్ధి వంటి బృహత్తర ప్రాజెక్టులలో చంద్రబాబు చూపిన దార్శనికతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్రం 70 మీటర్ల వెడల్పును అనుమతిస్తే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా దానిని 140 మీటర్లకు పెంచాలని చంద్రబాబు పట్టుదలగా కృషి చేశారని, ఈ విషయంలో అర్ధరాత్రి ఒంటిగంటకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశమై ఒప్పించారని గుర్తు చేశారు.
చంద్రబాబు జన్మదిన సందర్భంగా ఆయన్ను ప్రశంసిస్తూ, ఆయన ప్రసంగాల సంకలనంగా రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఏపీ అసెంబ్లీ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెమ్మసాని, తన అనుభవాలను పంచుకుంటూ పై వ్యాఖ్యలు చేశారు.