Pawan Kalyan Humanity: అది ఏప్రిల్ 7..! అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలోని పెదపాడు గ్రామాన్ని సందర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ గిరిజన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ, స్థానికుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. రోడ్లు, నీటి సౌకర్యం, విద్యుత్ వంటి పెద్ద సమస్యల గురించి చర్చిస్తున్నప్పుడు…. ఒక చిన్న కష్టం.. కానీ హృదయాన్ని కదిలించే దృశ్యం.. ఆయన దృష్టిని ఆకర్షించింది. గ్రామస్తులు… ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు చెప్పులు లేకుండా కఠినమైన అడవి బాటలో నడుస్తున్నారు. వారి కాళ్లలో చిన్న చిన్న గాయాలు, రాళ్లు, ముళ్లు గుచ్చుకున్న గుర్తులు చూసి పవన్ చలించిపోయారు. ఒక సామాన్య మనిషి కష్టం, అడవి తల్లి బాటలో నడిచే ఒక గిరిజన మహిళ ఎదుర్కొనే చిన్న అసౌకర్యం కూడా పవన్‌ని కలచివేసింది. ఆ క్షణంలో, ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిలా కాదు, ఒక గిరిజన బిడ్డ కష్టాన్ని అర్థం చేసుకునే తోటి మనిషిలా ఆలోచించారు.
వెంటనే తన సిబ్బందికి ఆదేశాలిచ్చారు. గ్రామ జనాభా, వారి చెప్పుల సైజులను సర్వే చేయమని చెప్పారు. కేవలం పది రోజుల్లో, అంటే ఏప్రిల్ 17న 345 మంది గిరిజనులకు కొత్త పాదరక్షలు అందాయి. పవన్ కార్యాలయ సిబ్బంది, స్థానిక సర్పంచ్‌తో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ఈ చెప్పులను పంపిణీ చేశారు. ఆ గ్రామంలోని పిల్లలు, వృద్ధులు చిరునవ్వులతో కొత్త చెప్పులతో అడుగులేస్తున్న దృశ్యం.. ఇప్పుడా గ్రామానికే ఓ కొత్త ఆశాకిరణం. ‘ఇప్పుడు మా అడుగులు నొప్పి లేకుండా నడుస్తాయి’ అంటూ ఆనందంతో మురిసిపోతున్నారు అక్కడి అవ్వా తాతలు. గ్రామంలోని పిల్లలు కొత్త చెప్పులతో ఆడుకుంటూ.. ‘పవన్ సారు మాకు బహుమతి పంపించారు’ అంటూ బోసినవ్వులతో చెబుతున్నారు. ఈ సంఘటన గిరిజనులకు కేవలం పాదరక్షల్నే అందించలేదు… ఒక నాయకుడు తమ గురించి ఆలోచిస్తున్నాడనే భరోసాను, వారి జీవితాల్లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. అలా ఒక చిన్న గ్రామంలో ఒక గొప్ప చొరవ ఇప్పుడు అందరి మన్ననల్ని అందుకుంటోంది.
పెదపాడు సంఘటన పవన్ కళ్యాణ్ మానవత్వానికి, సున్నితమైన ఆలోచనా విధానానికి ఒక ఉదాహరణ మాత్రమే. గతంలో ఆయన అనేక సందర్భాల్లో ప్రజల బాధలను తన బాధలుగా భావించి, స్వయంగా సాయం చేశారు. ఒక వైపు తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో ఉన్నప్పుడు, ఆయన తన కష్టాన్ని పక్కనపెట్టి, గిరిజనులకు ఇచ్చిన మాట కోసం పెదపాడు గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే పనిలో ఉన్నారు. ఈ సంఘటన ఆయన కర్తవ్యనిష్ఠను, ప్రజల పట్ల బాధ్యతను స్పష్టం చేసింది. సరిగ్గా ఓ రెన్నెళ్ల క్రితం జరిగిన సంఘటన గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఇదే మన్యం జిల్లా పరిధిలోని అనంతగిరి మండలం బల్లగరవ గ్రామంలో పర్యటనకు వెళ్లారు పవన్ కళ్యాణ్. తిరుగు ప్రయాణంలో బల్లగరవ గ్రామానికి ఓ కిలోమీటర్ దూరంలో ఉన్న మరో చిన్న గ్రామంలోని పాఠశాల వద్ద ఆగారు. ఓ 43 మంది పిల్లలు చదువుతున్న చిన్న పాఠశాల అది.
Also Read: Dilip Ghosh: 61 ఏళ్ల వయసులో మహిళా నేతను పెళ్లాడిన బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు
Pawan Kalyan Humanity: ఏ క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ పాఠశాల భవంతిలోనే ప్రమాదకరమైన స్థితిలో అభం శుభం తెలియని చిన్నారులు చదువుకుంటున్నారు. తాగు నీటి వసతి లేదు. మరుగుదొడ్ల జాడే లేదు. ఆ పాఠశాల ధీన స్థితిని గమనించిన పవన్… పెన్నూ పేపర్ తీసుకుని ఏదో నోట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే.. అవసాన దశలో ఉన్న ఆ పాఠశాల భవంతిని నేల మట్టం చేశారు. దాని ప్లేస్లోనే దాని కంటే పెద్దగా, విశాలంగా కొత్త పాఠశాల భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దాని పక్కనే బోరు వేశారు. ఆ బోరులో నిండా నీరు పడింది. పాఠశాల భవనం, దాని పరిసరాల చుట్టూ ఎంచక్కా ప్రహరీ గోడ (కట్టేశారు.) ఆ ప్రాంగణంలోనే పిల్లలకు మరుగుదొడ్లు (కూడా నిర్మాణమయ్యాయి.) ఈ పనులన్నీ పూర్తిగా పవన్ సొంత నిధులతో జరిగినవే.
ఒక గిరిజన బిడ్డ కన్నీటిని తుడిచేవాడు, ఒక రైతు ఆవేదనను అర్థం చేసుకునే వాడు, ఒక సామాన్యుడి చిన్న కష్టానికి కూడా చలించేవాడు రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు. అందుకే అంటారు మహానుభావులు ఊరికే అవ్వరని. ఈ సున్నితత్వం, ఈ స్పందనే పవన్‌ని ప్రజలకు దగ్గర చేస్తోంది అంటున్నారు పరిశీలకులు. అందుకే.. మా నాయకుడు మనుషుల్ని మనుషులుగా చూస్తాడు, ఓటర్‌గా చూడడు, ఆయన లాంటి మంచి వ్యక్తి మరొకరు ఉండరు.. అంటూ ఉప్పొంగిపోతూ చెబుతారు జనసైనికులు. సొంత డబ్బుతో సాయం చేస్తాడు… చేతలతోనే మాట్లాడతాడు అంటూ గర్వంగా చెప్పుకుంటారు.
