YCP Deadly Warnings

YCP Deadly Warnings: ఏపీలో మళ్లీ విజృంభిస్తున్న ‘వైరస్‌’

YCP Deadly Warnings: ఆంధ్రప్రదేశ్‌లో సోషల్‌మీడియా ఇప్పుడు స్వేచ్ఛగా అభిప్రాయాలు పంచుకునే ఒక వేదికలా కాకుండా.. రాజకీయ యుద్ధభూమిలా మారింది. ఈ జాడ్యం ఎప్పుడో మొదలైనా… ఇప్పుడు వైసీపీ నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకెళ్తోందా? వైసీపీ సోషల్‌మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా చంపేస్తాం, నరికేస్తాం అనే బెదిరింపులే దర్శనమిస్తున్నాయ్‌. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్, చేబ్రోలు కిరణ్‌లపై మొదలైన ఈ హెచ్చరికలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. సాక్షాత్తూ మాజీ సీఎం జగన్‌ సైతం ‘పోలీసుల బట్టలూడదీస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు. ఈ విష సంస్కృతి ఎక్కడికి దారితీస్తుంది? చట్టం ఈ బెదిరింపులను ఎలా చూస్తుంది? రాష్ట్ర భవిష్యత్తుపై ఈ ఉన్మాదం ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ ప్రత్యేక కథనంలో విశ్లేషిద్దాం.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పుడు బెదిరింపులు, దూషణల పర్వం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఈ విష సంస్కృతిని కొత్త ఉన్మాద స్థాయికి తీసుకెళ్తోందన్న అభిప్రాయాలు అంతటా వ్యక్తం అవుతున్నాయి. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులను ‘చంపేస్తాం’ అంటూ వైసీపీ సోషల్ మీడియా వీడియోలతో హెచ్చరించడం అందుకు తాజా ఉదాహరణ. ఈ బెదిరింపులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సుధాకర్, నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేయించారు.

ఈ ఒక్క సంఘటన మాత్రమే కాదు.. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌… వైఎస్ భారతి రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా.. అతనిపై ‘చంపేస్తాం’ అంటూ వైసీపీ కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఆ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాదవ్‌ అయితే పోలీసు వాహనాలను వెంబడించి, మార్గమధ్యలో దాడులకు యత్నించారు. ఎస్పీ కార్యాలయంలోనే కిరణ్‌పై దాడికి యత్నించారు. ఇలాంటి సంఘటనలు వైసీపీలో బెదిరింపులు ఒక ట్రెండ్‌గా మారాయన్నది సూచిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Chandrababu: రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి

సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ఈ సంస్కృతికి దూరంగా లేరు. ఆయన పదేపదే ‘పోలీసుల బట్టలూడదీస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు. తమ కార్యకర్తలకు డీఎస్పీలు, ఎస్పీలతో సెల్యూట్‌ కొట్టిస్తామని కూడా హామీలిస్తున్నారు. ఇక యథా రాజా తథా ప్రజ అన్నట్లు.. వైసీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు మరింత శృతిమించి మాట్లాడుతున్నారు. ‘గుంటూరు ఇవతల అయితే ఇళ్ల నుంచి ఈడ్చుకొచ్చి కొడతాం, గుంటూరు అవతల అయితే వెంబడి నరుకుతాం’ అని హెచ్చరిస్తున్నారు.

వైసీపీ హయాంలో వర్రా రవీంద్ర రెడ్డి, ఇప్పాల రవీంద్రారెడ్డి, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, పాలేటి కృష్ణవేణి, అనితా రెడ్డి వంటి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూటమి నాయకులను, వారి కుటుంబ సభ్యులను దూషిస్తూ అనేక జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు, పోస్టులు పెట్టారు. అయినప్పటికీ కూటమి పార్టీల సోషల్‌మీడియా కార్యకర్తల్లో ఇలా చంపుతాం, నరుకుతాం అనే సంస్కృతి కనబడేది కాదు. మహా అయితే వారు అదే స్థాయిలో బూతులు తిట్టేవారేమో. కానీ గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఆదేశాల మేరకు సోషల్‌మీడియా కార్యకర్తలు శృతిమించి బెదిరింపులకు దిగుతున్నారు. 2029 ఎన్నికల తర్వాత ‘ఒక్కొక్కరినీ ఈడ్చుకొచ్చి చంపేస్తాం’ అంటూ వైసీపీ కార్యకర్తలు బహిరంగంగానే హెచ్చరికలు చేయడం ఈ మధ్య కాలంలో అత్యంత సహజంగా మారిపోయింది. ఈ ఉన్మాదం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పుగా మారుతోందన్న ఆందోళన మేధావి వర్గాల్లో వ్యక్తమవుదోంది.

భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) ప్రకారం, ఒక వ్యక్తిని ‘చంపుతాను’ అని బెదిరిస్తే సెక్షన్ 503 – క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద కేసు నమోదవుతుంది. దీనికి సెక్షన్ 506 ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించాలి. అదే, ‘చంపుతాము’ అంటూ సమూహంగా బెదిరిస్తే, అది వ్యవస్థీకృత నేరంగా పరిగణించబడి, సెక్షన్ 120బీ లేదా ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66ఎఫ్ – సైబర్ టెర్రరిజం కింద కేసులు నమోదవుతాయి. ఇవి నాన్-బెయిలబుల్ నేరాలుగా పరిగణించబడతాయి. ఇందులో ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడవచ్చు. సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు జరిగితే, ఐటీ యాక్ట్ సెక్షన్ 67 కింద కూడా చర్యలు తీసుకోవచ్చు.

కాబట్టి ఇప్పుడు చంపేస్తాం, నరికేస్తాం అంటున్న వాళ్లంతా ఏదో ఒకరోజు జైలుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే జరిగిన సోషల్‌మీడియా అరెస్టులతో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అంటూ గగ్గోలు పెడుతూనే… మేం అధికారంలోకి వస్తే రాజా రెడ్డి రాజ్యాంగం తీసుకొస్తాం.. వెంటబడి చంపుతాం అంటూ పోస్టులు పెడుతుండటం వారి మూర్ఖత్వానికి నిదర్శనంగా కనబడుతోంది. వైసీపీ హైకమాండ్ తన సోషల్ మీడియా కార్యకర్తలను నియంత్రించకపోవడం ఈ ఉన్మాదానికి ఊతమిస్తోంది. ఈ విష సంస్కృతిని ఉపేక్షిస్తే, రాష్ట్రంలో రాజకీయ హింస, సామాజిక అశాంతి పెరిగే ప్రమాదం ఉంది. 

వైసీపీ సోషల్ మీడియా బెదిరింపులు కేవలం రాజకీయ వ్యూహంగానే కాక, రాష్ట్ర శాంతి భద్రతలకు ముప్పుగా మారాయన్న వాదన వినబడుతోంది. ఆ పార్టీ హైకమాండ్ దీనిని నియంత్రించకపోగా, అదే తోవలో మరింతగా ప్రోత్సహిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఈ విష సంస్కృతిని అరికట్టకపోతే, ఏపీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి వైసీపీలో మార్పు వస్తుందా? లేక కూటమి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందా? వేచిచూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *