Vontimitta: కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామాలయానికి ఒక విశిష్టత ఉన్నది. ఏటా దేశ ప్రజలు శ్రీరామనవమి పర్వదినాన్ని చైత్రశుద్ధ నవమినాడు సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకుంటారు. కానీ ఈ ఒంటిమిట్ట రామాలయంలో మాత్రం శ్రీరామనవమి తర్వాత ఐదు రోజుల తర్వాత సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ఈ మేరకు రేపు అంటే ఏప్రిల్ 11న శుక్రవారం సీతారాముల కల్యాణం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Vontimitta: ఒంటిమిట్ట ఆలయంలో ఈ నెల 7 నుంచి 14 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రమణీయంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. నిత్యం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ వేడుకలను కనులారా చూసి తరించిపోతున్నారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
విశేషం ఏమిటంటే?
Vontimitta: ఏటా నవమి రోజు మధ్యాహ్నం సమయంలో జరుగుతున్న సీతారాముల కల్యాణాన్ని తాను చూడలేకపోతున్నానని చంద్రుడు బాధపడ్డాడట. అందుకే ఒంటిమిట్టలో పున్నమి కాంతులతో కల్యాణం జరుగుతుందని ఒక కథనం. చంద్రవంశానికి చెందిన విజయనగర రాజులు తమ కులదైవానికి తృప్తి కలిగేలా రాత్రి పూట కల్యాణం జరిపించే ఆచారాన్ని అనుసరిస్తూ వస్తున్నారని, అదే నేటికీ కొనసాగుతుందని మరో నానుడి.
కల్యాణ వేళలు
Vontimitta:ఒంటిమిట్ట కోదండరామాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 11న సాయంత్ర కల్యాణ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల మధ్యన రాములోరి కల్యాణం జరుగుతుంది. ఈ కల్యాణ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Vontimitta: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణ వేడుకను పండుగలా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదిక, గ్యాలరీలను సిద్ధం చేసి ఉంచారు. రోడ్లు, పార్కింగ్, విద్యుత్తు, బారికేడ్లు, పారిశుద్ధ్య పనులను పూర్తిచేశారు. 2000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హాజరయ్యే భక్తుల కోసం లడ్డూ ప్రసాదాలను అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేసి ఉంచారు.