Vardhanpet: వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట నియోజకవర్గం. ఇక్కడ 2014, 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. సిద్దిపేటలో హరీశ్ రావు తర్వాత రెండో భారీ మెజారిటీ వర్ధన్నపేటలోనే నమోదైంది. 2023లో ఎన్నికల్లో మాత్రం బీఆర్‌ఎస్ బండి తిరగబడింది. కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ ఓడిపోయారు. ఆ తర్వాత ఆరూరి రమేష్ బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిపోయి.. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసారు. అప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీకి వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇన్‌ఛార్జ్ లేరు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ ముందుండి నడిపించే నాయకుడే లేడు.
ఎస్సీ రిజర్వుడ్‌గా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం డీలిమిటేషన్‌లో జనరల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఎలాగైనా ఇన్‌ఛార్జ్ పదవిని దక్కించుకుని నియోజకవర్గంలో పాగా వేసేందుకు హేమాహేమీలైన నాయకులు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుండి బీఆర్ఎస్‌లో చేరిన ఏనుగు రాకేష్ రెడ్డిలు ఇంచార్జ్ రేస్‌లో పోటాపోటీగా తలబడుతున్నారు.
Vardhanpet: మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ స్వగ్రామం ఏనుగల్లు వర్ధన్నపేట నియోజకవర్గంలోనే ఉంటుంది. తన కుటుంబానికి చెందిన ప్రతిమ గ్రూప్ సంస్థల ద్వారా వినోద్ ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా సామాజిక, ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుండి వినోద్ కుమార్ కలిసి పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుగుణంగా లేఖలు ఇచ్చేలా చేసింది వినోద్ కుమారే. కేసీఆర్‌తో తనకున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో.. ఎలాగైనా తనకే ఇన్‌ఛార్జ్ పదవి దక్కుతుందని ధీమాతో ఉన్నారు. తన స్వగ్రామం ఏనుగల్లులో ఇంటి నిర్మాణం కూడా చేస్తున్నారు.
6 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వర్ధన్నపేట నియోజకవర్గం మీద కన్నేశారు. వర్ధన్నపేట నియోజకవర్గం ఎర్రబెల్లి దయాకర్ రావుకు రాజకీయ జన్మనిచ్చింది. ఇక్కడ నుండి ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా వర్ధన్నపేట ఎస్సీకి రిజర్వ్ కావడంతో దయాకర్ రావు పక్కనే ఉన్న పాలకుర్తికి షిఫ్ట్ అయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి మీద కొంత అయిష్టంగా ఉన్నారట. ఒకవేళ పాలకుర్తి మహిళకు రిజర్వ్ ఐతే.. తన సతీమణి ఎర్రబెల్లి ఉషను అక్కడ నుండి పోటీ చేయించి… తాను వర్ధన్నపేట నుండి పోటీ చేయాలని ఎర్రబెల్లి భావిస్తున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కావాలని కేసీఆర్‌ను అడుగుతున్నట్టు సమాచారం.
Also Read: ATM Charges: మే 1 నుంచి ఏటీఎం చార్జీలు భారం
Vardhanpet: తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ప్రస్తుతం నియోజకవర్గం అంటూ లేదు. తన సొంత నియోజకవర్గం పరకాలలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూపంలో బలమైన నాయకుడు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనగామ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎగరేసుకుపోయాడు. కాబట్టి ఖాళీగా ఉన్న వర్ధన్నపేట కావాలని పోచంపల్లి అడుగుతున్నారట. ఉద్యమ నేపథ్యం ఉన్న పలువురు బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లికి మద్దతుగా నిలుస్తున్నారని టాక్.
ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఏనుగు రాకేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌లో చేరారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి పోటీ చేసి తీన్మార్ మల్లన్న చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తనకే ఇవ్వాలని రాకేష్ రెడ్డి కోరుతున్నారట. తన సొంత గ్రామం ఆరేపల్లి.. వర్ధన్నపేట నియోజకవర్గంలోనే ఉంటుంది. కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఏనుగు రాకేష్ రెడ్డి కోసం తీవ్రంగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోసం హేమహేమీలు పావులు కదుపుతుంటే… పార్టీని వదిలి వెళ్లిన ఆరూరి రమేష్‌ను.. బీఆర్ఎస్‌లో తిరిగి జాయిన్ చేయించేందుకు ఓ వర్గం నేతలు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతల సమావేశం ఇటీవల కేసీఆర్‌తో జరగగా.. ఆరూరి రమేష్ ప్రస్తావనను తెచ్చినట్టుగా తెలిసింది. దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారనీ, పార్టీని వదిలి వెళ్లిన నాయకులు అవసరం లేదని ఖరాకండిగా చెప్పారని తెలిసింది.